గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 14, 2020 , 02:40:18

నూతన రెవెన్యూ చట్టం విప్లవాత్మకం

నూతన రెవెన్యూ చట్టం విప్లవాత్మకం

రాష్ట్రంలో ఇక నుంచి ఎక్కడా భూ వివాదాలకు తావుండకూడదని తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని, ఇది దేశంలోనే ఒక విప్లవాత్మకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఒకేచోట అన్ని పనులయ్యేలా దీనికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మొక్కలు నాటి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  - కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలందరిలోనూ హర్షం వ్యక్తమవుతున్నదని, ఈ చట్టంతో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ముందుగా హరితహారంలో భాగంగా పద్మనగర్‌లోని ఘనీకృత ఆబోతుల వీర్య ఉత్పత్తి కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం మల్కాపూర్‌ రోడ్డులో, నగరపాలక సంస్థ కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మార్ట్‌ టాయిలెట్లను ప్రారంభించారు. కొత్త ఫాగింగ్‌ యంత్రాలను ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మళ్లీ మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మ్యుటేషన్‌ అయ్యే పద్ధతిలో కొత్త రెవెన్యూ చట్టం తయారు చేసినట్లు తెలిపారు. ఈ చట్టానికి అనుగుణంగా, మున్సిపల్‌,            పంచాయతీ రాజ్‌ చట్టాలను కూడా సభలో సవరించినట్లు చెప్పారు. భూ వివాదాలు రాకుండా ఉండేందుకు న్యాయ, ఆర్థిక నిపుణులతో చర్చించి, వాటిపై లోతుగా ఆలోచనలు చేసినట్లు చెప్పారు. బ్రిటీష్‌ కాలం నుంచి ఉన్న 80 రెవెన్యూ చట్టాలకు సవరణలు చేసి త్వరలోనే రెవెన్యూ                  కోడ్‌ను ముందుకు తీసుకువస్తామని, వచ్చే శాసనసభ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. 

నగరాభివృద్ధిలో పాలకవర్గ కృషి అభినందనీయం 

కరీంనగర్‌ అభివృద్ధి విషయంలో నగర మేయర్‌ వై సునీల్‌రావు, పాలకవర్గ సభ్యుల కృషి అభినందనీయమమని, మేయర్‌ ప్రత్యేక చొరవతోనే స్మార్ట్‌సిటీ పనులు వేగంగా సాగుతున్నాయని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్‌ అని, ప్లానింగ్‌ బోర్డు నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. స్మార్ట్‌సిటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. 

జాతీయ రహదారి నుంచి వెనక్కి పోవడం సిగ్గుచేటు

జగిత్యాల నుంచి వరంగల్‌ రహదారిని తాను ఎంపీగా ఉన్న సమయంలో 563వ జాతీయ రహదారిగా గుర్తించారని, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పనుల నుంచి తప్పుకోవడం సిగ్గుచేటని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. కరీంనగర్‌ను జంక్షన్‌గా మార్చాలని 5 జాతీయ రహదారులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశామని, దీనికి సంబంధించి డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి అందించామని గుర్తు చేశారు. ఆ మేరకు కరీంనగర్‌లో జాతీయ రహదారుల సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయించామని, కానీ ఇప్పుడు ఆ కార్యాలయం మూసే ఉంటుందని తెలిపారు. వరంగల్‌ జాతీయ రహదారి విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో పార్లమెంట్‌ సభ్యులు స్పందించాలని సూచించారు. జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, అదే విషయాన్ని తాము అడుగుతున్నామన్నారు. 

సాహసోపేత నిర్ణయం :  మంత్రి గంగుల

ఏళ్ల తరబడిగా భూ వివాదాలకు స్వస్తి పలికేలా సీఎం కేసీఆర్‌ కొత్త చట్టంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ చట్టం చేసేటప్పుడు తాము సభలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కాంక్రీట్‌ జంగల్‌గా ఉన్న కరీంనగర్‌ను హరిత జిల్లా మార్చాలని కంకణం కట్టుకున్నామని, ఇందులో భాగంగా ఆరో విడుత హరితహారంలో 55 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 43.85 లక్షలు నాటినట్లు చెప్పారు. మరో 15 రోజుల్లో మిగిలిన మొక్కలను నాటుతామని తెలిపారు. మరో రెండేళ్లలో వనాలకు పుట్టినిల్లుగా జిల్లాను తయారు చేసి మొదటి పది స్థానాల్లో నిలుపుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చొరవతోనే నగరంలో 14 కిలోమీటర్ల ప్రధాన రహదారులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ప్రతిరోజూ నీటి సరఫరా చేస్తున్నామని, త్వరలోనే 24 గంటలపాటు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు 15 స్మార్ట్‌ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను త్వరలోనే అందిస్తామని, ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధమైందని చెప్పారు. త్వరలోనే కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించుకుంటామన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్లు గంట కళ్యాణి, శ్రీనివాస్‌, బోనాల శ్రీకాంత్‌, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.logo