బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 12, 2020 , 03:09:45

ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  •  కలెక్టర్‌ శశాంక ఆదేశం

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో మంజూరైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వాటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో అర్బన్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులపై ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, సీపీవో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 6,494 డబుల్‌ బెడ్‌ రూం గృహాలు మంజూరయ్యాయని, ఇందులో 784 ఇప్పటికే పూర్తి కాగా, 1,993 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వీటికి మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్‌, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఇందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తయిన గృహాలు దసరా వరకు లబ్ధిదారులకు అందజేసేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ మాధవరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, మిషన్‌ భగీరథ ఈఈ ఉప్పలయ్య, చల్మారెడ్డి, చిన్నారావు, ముఖ్య ప్రణాళికాధికారి పూర్ణచంద్రరావు, తదితరులున్నారు.

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

హరితహారంపై అదనపు కలెక్టర్‌, డీఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేయని వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలన్నారు. ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. 

అర్హులందరికీ రుణాలు 

ప్రత్యేక డీసీసీ సమావేశంలో భాగంగా బ్యాంకర్లతో కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్‌ఎల్‌బీసీ, తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు అర్హత గల వారందరికీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద రుణాల గడువు పొడిగించినట్లు తెలిపారు. అర్హత గల ఎంఎస్‌ఎంఈలకు 20 శాతం మూలధన రుణాలు మంజూరు చేయాలని, ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలపాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకు మేనేజర్లు రుణాలపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం లక్ష్మణ్‌, జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


logo