శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 12, 2020 , 03:09:47

ధరణి నవ్వింది..

ధరణి నవ్వింది..

  • కొత్త రెవెన్యూ చట్టానికి  అసెంబ్లీ ఆమోదం

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. గత చట్టాల్లో ఉన్న  లొసుగులు, లోపాలకు చెక్‌ పెట్టి.. రాష్ట్ర సర్కారు సరికొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నది. శుక్రవారం శాసనసభ ఆమోదం పొందిన ఈ చట్టం, సవాలక్ష సమస్యలకు సరైన మార్గం, పరిష్కారం చూపనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్లూ ఎదుర్కొన్న కష్టాలు భవిష్యత్‌లో ఉండవన్న నమ్మకం ప్రజల్లో బలంగా కలుగుతున్నది. వీఆర్వోల వ్యవస్థ రద్దుతో ప్రారంభమైన కొత్త చట్టం.. క్షేత్రస్థాయిలో ఎన్నో పరిష్కార మార్గాలు చూపింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి వ్యవసాయ భూములను వేరు చేయడం మొదటి మెట్టు కాగా, సదరు రైతన్నలు నేరుగా వారి మండలంలోని తహసీల్దార్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం సర్కారు కల్పించింది. దీంతో రైతులు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, వ్యయ ప్రయాస కూడా తగ్గుతుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌ రోజే సదరు భూమి క్రయవిక్రయాలకు సంబంధించి మ్యుటేషన్‌ చేయడం, ఆ వెంటే పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయడానికి తీసుకున్న నిర్ణయాలపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నదన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. 

మరోసారి అవకాశం.. 

నూతన చట్టం చేయడమే కాదు, భూ సమస్యలను శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూనుకున్నారు. అందుకోసం గతంలో అవకాశం ఇచ్చినట్లుగానే మరోసారి సాదాబైనామాలు, జీవో నంబర్‌ 58, 59 కింద క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడానికి పరిశీలిస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో సాదాబైనామాల ద్వారా భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎలాంటి ఫీజు లేకుండా క్రబద్ధీకరణచేసి తన పెద్ద మనసును చాటుకున్నది. ఉమ్మడి జిల్లాలో సాదాబైనామాల కింద 2.70 లక్షల దరఖాస్తులు రాగా, అర్హత ఉన్న వారందరికీ క్రమబద్ధీకరణ చేసింది. అలాగే జీవో నంబర్‌ 58, 59 ద్వారా వేలాది మందికి లబ్ధి కలిగింది. ప్రస్తుతం కొత్త చట్టం అమల్లోకి వస్తున్న ఈ సమయంలో మరోసారి అవకాశం ఇచ్చి.. ఈ తరహా సమస్యలను పూర్తిగా లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. ధరణి వెబ్‌సైట్‌లో అన్ని రకాల భూ వివరాలను నమోదు చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి అమల్లోకి వచ్చిన తదుపరి మళ్లీ ఈ తరహా సమస్యలు ఉత్పన్నం కావద్దని భావిస్తున్నది. అందులో భాగంగానే.. కేబినెట్‌ మీటింగ్‌లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 

వీఆర్‌ఏలపై సానుభూతి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌ఏలపై మరోసారి సానుభూతి చూపారు. ఇప్పటికే వారికి స్కేల్‌ ఆఫ్‌ వేతనం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించిన ఆయన.. ఒక వేళ ఎవరైనా ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వీఆర్‌ఏలు, తమ కుటుంబ సభ్యులకు కావాలని దరఖాస్తు ఇస్తే తప్పకుండా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2,537 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. అందులో కొంత మంది ఇప్పటికే వయసు పైబడి తమ పిల్లలకు ఉద్యోగావకాశం కల్పించాలని అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. వీటితోపాటుగా వక్ఫ్‌ బోర్డుభూములు, దేవాలయ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..logo