శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 11, 2020 , 03:04:50

నౌకరీకి భరోసా

నౌకరీకి భరోసా

  • ఉద్యోగ భద్రతపై వీఆర్వో, వీఆర్‌ఏల హర్షం
  • lఇతర శాఖల్లో సర్దుబాటుకు సమ్మతం  lస్కేల్‌ ఆఫ్‌ వేతన ప్రకటనతో ఆనందం lకొత్త రెవెన్యూ చట్టానికి ఆహ్వానం 
  • lముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు  

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఒక వ్యవస్థ రద్దయినప్పుడు.. అంతెందుకు రెవెన్యూ శాఖలో ఇదే వీఆర్‌వోల స్థానంలో అంతకు ముందున్న వ్యవస్థలు రద్దయినప్పుడు ఏం జరిగింది? ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల ఆందోళనలు.. ప్రతిపక్షాల సంఘీభావాలు.. కలెక్టరేట్ల ఎదుట దీక్షలు.. తమకు న్యాయం జరగాలని రోడ్లెక్కడాలు.. ఉద్యోగాలు పోతాయేమోనని ఆత్మహత్యాయత్నాలు.. ఎన్నెన్ని జరిగాయి.. ఇప్పుడు వీఆర్వోల వ్యవస్థ రద్దయిన తర్వాత ఎక్కడా ఒకప్పటి పరిస్థితులు కనిపించలేదు.. పైగా ఎవరైతే నష్టపోతామని ఆందోళనకు గురయ్యారో.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీతో వాళ్లే ఇప్పుడు ఈ చట్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. తమకెంతో మేలు చేశారని ఇటు వీఆర్‌వోలు.. అటు వీఆర్‌ఏలు.. కేసీఆర్‌ చిత్రపటాలను పాలతో అభిషేకిస్తున్నారు. తమను నరకం నుంచి విముక్తుల్ని చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో కలిసి కొత్త రెవెన్యూ చట్టానికి ఆహ్వానం పలుకుతున్నారు.   

   కేసీఆర్‌పై సంపూర్ణ విశ్వాసం

రెవెన్యూ శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతిని నయా రెవెన్యూ చట్టంతో కూకటి వేళ్లతో పెకిలించిన సీఎం కేసీఆర్‌కు వీఆర్‌వోలు, వీఆర్‌ఏలతో తిప్పలు తప్పవని ప్రతిపక్షాలు ఊహించి ఉండవచ్చు. అవకాశం వస్తే తాము సైతం రంగంలోకి దిగేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుని ఉండవచ్చు. కానీ, చట్టం తెచ్చేందుకు ముందే సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించి కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వీరి ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. బుధవారం ‘ది తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ 

పట్టాదారు పాసు బుక్స్‌ బిల్‌-2020’ని ప్రవేశ పెట్టిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో ఇటు వీఆర్‌వోలు, అటు వీఆర్‌ఏలలో చోటు చేసుకున్న ఆందోళనలు మటుమాయమయ్యాయి. ఉద్యోగ భద్రత ఉంటుందా? లేదా? అనే ఆందోళన అప్పటి వరకు వారిలో కనిపించగా, వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని, వీఆర్‌ఏలను స్కేల్‌ ఎంప్లాయీస్‌గా గుర్తిస్తామని సీఎం ఇచ్చిన హామీతో వారికి భరోసా లభించింది. దీంతో కేసీఆర్‌ చిత్రపటాలను పాలాభిషేకాలతో ముంచెత్తారు. బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంలోనే కొందరు వీఆర్‌ఓలు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేశారు. వీఆర్‌ఏలు కూడా ఇదే దారిలో నడిచారు. 

  ఎవరికీ అన్యాయం జరగదు 

కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూలో ఉన్న కిందిస్థాయి ఉద్యోగులైన వీఆర్‌వోలు, వీఆర్‌ఏలపై ప్రధానంగా వేటు పడుతోంది. అయితే, వీరి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. వీఆర్‌వోల్లో చాలా మంది వారసత్వంగా వచ్చిన ఉద్యోగులే ఉన్నారు. 2007లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు సరిపడా ఉద్యోగులు కావాలని గ్రామ సుంకరులుగా పనిచేసిన వారికి పదోన్నతులు కల్పించి నియామకాలు చేశారు. వారసత్వంగా వచ్చిన సుంకరి పోస్టుల నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన వీఆర్‌వోలు తాజా పరిణామాలతో సహజంగానే కంగుతిన్నారు. అయితే, వీరిని ఇతర శాఖల్లో భర్తీ చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో భరోసా పెంచుకున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న తమకు పూర్తిగా విముక్తి లభించిందని కొందరు వీఆర్‌వోలు ఇప్పుడు బాహాటంగానే చెబుతున్నారు. వీఆర్‌వోలలో వతందారి వ్యవస్థ నుంచి వచ్చిన వారు కొందరైతే, వారసత్వ సుంకరి పోస్టుల నుంచి వచ్చిన వారు మరి కొందరు. ఉన్నత చదువులు చదివి నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయిన వారు ఇంకొందరు ఉన్నారు. వీరిలో ఎవరికీ అన్యాయం జరగకుండా ఇతర శాఖలకు సర్దుబాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇక వీఆర్‌ఏల సంతోషానికైతే అంతులేదు. ఇప్పటికీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా ఉంటూ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పూర్తి భరోసా లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఈ వ్యవస్థలో ఎక్కువగా ఉన్నారు. వీరిని ఇప్పుడు ప్రభుత్వం స్కేల్‌ ఎంప్లాయీస్‌గా గుర్తిస్తోంది. అంటే ఇప్పటి వరకు పార్ట్‌టైమర్లుగా ఉన్న వీఆర్‌ఏలు ఇక నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులు కాబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెవెన్యూలో కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్‌ఏల కుటుంబాలు కూడా బాగుపడబోతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. 

  శాశ్వత రద్దు నిర్ణయం సరైనదే.. 

రెవెన్యూ శాఖలో అనేక లోపభూయిష్ట చట్టాల కారణంగా సామాన్య రైతులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. అనుకూల, ప్రతికూల చట్టాల కారణంగా భూ సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోలేదు. దేశానికే ఆదర్శంగా తెచ్చిన కొత్త చట్టం శుక్ర, శనివారాల్లో అసెంబ్లీలో చర్చ తర్వాత ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లు కొత్త రెవెన్యూ చట్టం పూర్తిగా డిజిటలైజేషన్‌తో ముడిపడి ఉంది. దీంతో ఇప్పుడున్న మ్యాన్‌ పవర్‌ కూడా అవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీఆర్‌వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంపై ఇటు ప్రజల్లో, అటు ఉద్యోగుల్లో ఒకే విధమైన సానుకూల స్పందన కనిపిస్తోంది. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ చట్టం ప్రకారం ఆన్‌లైన్‌లో సేవలు అందబోతున్నాయి. వతందారి వ్యవస్థ నుంచి నేటి వీఆర్‌వో వ్యవస్థ వరకు ఎన్నడూ కానంత శరవేగంగా భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దు నిర్ణయం సరైనదేనని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. 


logo