బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 11, 2020 , 03:05:06

నూతన అధ్యాయానికి నాంది

నూతన అధ్యాయానికి నాంది

  • వినూత్న ఆలోచనలు.. విప్లవాత్మక నిర్ణయాలు
  • n పాత విధానాలకు స్వస్తి పలుకుతున్న సర్కారు
  • n సమస్యల పరిష్కారానికి సంస్కరణల దారి
  • n మార్పులు తెస్తూ.. విజయవంతం చేస్తూ ముందుకు 
  • n అదే బాటలో కొత్త రెవెన్యూ చట్టం 
  • n సకలజనుల హర్షం   n నేటి అసెంబ్లీ చర్చపై ఆసక్తి 

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) 

తెలంగాణ సర్కారు ప్రజల మేలే లక్ష్యంగా సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నది. అన్ని రంగాల్లో దశాబ్దాలుగా ఉన్న పాత చట్టాలను మార్చడం.. కొత్త చట్టాలు, కొత్త ఆలోచనలతో వినూత్న పథకాలను అమల్లోకి తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఏ చట్టం చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం చేస్తున్నది. ప్రతిపక్షాల సవాలక్ష అనుమానాలకు జవాబిస్తూ.. సాధ్యం కాదని విమర్శించిన నోళ్లను మూయిస్తూ.. సక్సెస్‌ చేసి చూపిస్తున్నది. ఉదాహరణకు.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ సాధ్యం కాదంటూ ఓ స్థాయిలో ప్రచారం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడేళ్ల వ్యవధిలోనే ప్రపంచమే నివ్వెరపోయేలా కాళేశ్వరం ఎత్తిపోతలను అందుబాటులోకి తెచ్చారు. సముద్రంలో కలిసే నీటిని తెలంగాణ మాగాణికి మళ్లిస్తూ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగించారు. ఇదే కాదు, రైతుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరిస్తే.. ముఖ్యమంత్రి మాత్రం రైతును రాజును చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి కోసం రైతుబంధు, పంటలు పండించుకోవడానికి 24 గంటల కరెంటు, ఏదేని కారణం వల్ల రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బీమా.. ఇలా ఎన్నో పథకాలను వర్తింపజేస్తున్నారు. వీటితోపాటు కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గురుకులాలు, విద్యా విధానంలో మార్పులు,  పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆది నుంచీ మేధోమథనం.. 

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా రోజుల కిందటే శ్రీకారం  చుట్టారు. లోతుగా ఆలోచిస్తే.. ఒక్కో సమస్యను ఒక్కో సమయంలో పరిష్కరిస్తూ వస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ విధానం వల్ల తలెత్తుతున్న సమస్యలకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అర్హత ఉన్న వాటిని పరిష్కరించారు. ఆ తర్వాత ‘భూ రికార్డుల శుద్ధీకరణ’ చేపట్టారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులు, రికార్డుల తారుమారు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని అర్హులకు న్యాయం చేసే అవకాశం కల్పించారు. అయితే అందులో కొంత న్యాయం జరిగినా.. మెజార్టీ రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి. ఆయా కార్యక్రమాల ద్వారా వెల్లువెత్తుతున్న సమస్యలు, ఫిర్యాదుల విషయంపై మూడేళ్లుగా ముఖ్యమంత్రి మేధోమథనం చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని ప్రకటించారు. చెప్పినట్లుగానే చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు. గత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే కొత్త రెవెన్యూ చట్టం ఇప్పటికిప్పుడే తేవడం లేదన్నది అర్థమవుతున్నది. ఎంతో మేధోమథనం చేస్తూ.. ఒక్కో అవకాశం కల్పిస్తూ.. అందులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్త్తూ.. కొత్త రెవెన్యూ చట్టానికి నాంది పలికినట్లు తెలుస్తున్నది.

తప్పనున్న తిప్పలు.. 

నిజానికి కొత్త నిర్ణయాలతో వస్తున్న రెవెన్యూ చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. నూటికి 95 శాతం మందికి రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్లతో ఏదో ఒక విధంగా సంబంధముంటుంది. వ్యవసాయ భూముల నుంచి ఇండ్ల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. వారసత్వ భూముల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. బ్యాంకు రుణాలు భూములతోనే ముడిపడి ఉన్నాయి. ఇలా ఏదో ఒక సందర్భంలో ప్రతి కుటుంబం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఒక సవాలుగా మారగా.. చేసుకున్న తర్వాత మ్యుటేషన్‌కు ముప్పు తిప్పులు పడడం, ఆ తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలకు నెలల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పని  కాని వారు కోకొల్లలుగా ఉన్నారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’ ధర్మగంట పేరిట రెవెన్యూ శాఖపై వార్తలు రాస్తే.. వందలాది మంది రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అమ్మిన వారు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ భూమే కాదు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలోనూ ఇబ్బందే. కొత్త చట్టం ద్వారా ఈ తిప్పలన్నీ తప్పనున్నాయి. దశాబ్దాలుగా అమలవుతున్న పాత చట్టాలను పాతరేసి తెస్తున్న కొత్త చట్టం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. అవినీతి, అక్రమాలకు చెక్‌ పడి భూములకు రక్షణగా నిలువనున్నది. సమస్త విరాలు ధరణి వెబ్‌సైట్‌లోనే ఉండనుండగా, ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తప్పుతుంది. 

నేటి చర్చపై ఆసక్తి.. 

ఎక్కడ చూసినా కొత్త రెవెన్యూ చట్టంపైనే చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి వెల్లడించిన అన్ని అంశాలపై ఆమోదయోగ్యమైన అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. ఈ తరుణంలో కొత్త చట్టంపై సమగ్రమైన చర్చ శుక్రవారం ప్రారంభం కానున్నది. దీనిపై ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతాయి? ఏమైనా సూచనలు చేస్తాయా? లేక ఎప్పటిలాగానే ఏదో ఒక విమర్శలకు దిగుతాయా? ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇంకా ఏయే అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశమున్నది? ఇంకా చట్టంలో కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా?.. వంటి అంశాలు తెరపైకి వస్తుండగా.. ప్రజలు ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. నేడు టీవీల ద్వారా తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. logo