ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 10, 2020 , 03:39:41

నయా.. రెవెన్యూ

నయా.. రెవెన్యూ

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెవెన్యూ ప్రక్షాళనకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా కొత్త చట్టాలను అమల్లోకి తెస్తున్నది. భూమిపై హక్కులు, పాసుపుస్తకాల చట్టం 2020, రెవెన్యూ అధికారుల రద్దు చట్టం 2020ని బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టాల ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ముఖ్యమంత్రే స్వయంగా వివరించారు. గతంలో ఉన్న లోపాలు.. వాటి ద్వారా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి మాటున జరిగిన అవినీతి, అక్రమాలు, గుండాయిజం, ఆక్రమణలు ఈ తరహా వాటికి కొత్త చట్టం ఎలా అడ్డుకట్ట వేస్తుందో వివరించి చెప్పారు. అంతేకాదు, దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా దూరమవుతాయో చెప్పడంతోపాటు రెండు రకాల రిజిస్ట్రేషన్లను అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించారు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు ఇక నుంచి తహసీల్దార్లు చేస్తారని, వీరికి సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలు కల్పిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, ఆ సమయం ప్రకారం వస్తే అదే రోజు రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి పంపేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు గతంలో మాదిరిగానే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతాయన్న ముఖ్యమంత్రి.. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యూటేషన్‌ కూడా ఇక ముందు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతుందని స్పష్టం చేశారు. ఇవేకాదు, కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రయోజనాలకు ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయో సవివరంగా విరించారు. 

  అందుబాటులోనే రిజిస్ట్రేషన్లు..  

పూర్వ కరీంనగర్‌ జిల్లాలో 57 మండలాలు ఉంటే 15 సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండేవి. సుమారు నాలుగు మండలాల వాసులు ఒకే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రావాల్సి ఉండేది. అంటే వివిధ మండలాల నుంచి క్రయ, విక్రయా ల రిజిస్ట్రేషన్లకు విధిగా చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం నాలుగు జిల్లాల్లో 61 మండలాలుండగా 13 సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. అంటే నాలుగైదు మండలాలకు ఒక సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఉంది. దీని వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అన్ని మండలాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడే చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా వ్యవ ప్రయాసలు తగ్గడమేకాదు, సమయం కూడా కలిసి వస్తుంది. 

   తగ్గనున్న వ్యయప్రయాస..

కొత్త చట్టం ప్రకారం తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగితే.. ముందుగా అక్రమ రిజిస్ట్రేషన్లు అంటే ప్రభుత్వ, దేవాదాయ శాఖ, అలాగే వివాదాస్పద భూముల వంటి వాటిని అడ్డుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా.. ఒక్కో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఐదు మండలాల వాళ్లు వస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఒక్కో సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు రోజు వారీగా వచ్చే ప్రజల సంఖ్య 20వరకు ఉంటుంది. అలా 13 కార్యాలయాలకు వచ్చి వెళ్లే వారి సంఖ్య ఏడాదికి 90వేల నుంచి లక్ష వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి వచ్చి పోవడంతోపాటు భోజనాలు, టీలు, టిఫిన్లు వంటి వాటికి కలిపి 200 అవుతుంది. ప్రస్తుతం తహసీల్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల వచ్చి పోయే ఖర్చులే ఏటా సుమారు 18 కోట్ల వరకు అదా అయ్యే అవకాశముంటుంది.

   ఇప్పుడు డిజిటల్‌ మ్యాపులు  

1910-1920 మధ్యలో ఉన్న ఆనాటి నైజాం సర్కారు వారి పరిధిలోని భూములకు టిప్పన్‌ (భూకమతం) తయారు చేసింది. గ్రామాల వారీ గా సర్వేనంబర్లు కేటాయించి, ఒక్కో సర్వేనంబర్‌వారీగా ఒక టిప్పన్‌ రూపొందించింది. ఆయా సర్వే నంబర్లలో ఉన్న భూమెంత? దానికి పట్టేదారులెవరు? అది ప్రభుత్వ భూమా? లేక ప్రైవేట్‌ స్థలమా? పరంపోగా? చెరువు శిఖమా? ఇనాం భూములా? అనే విషయాన్ని గుర్తించి, వాటికి సర్వేనంబర్లు కేటాయించి టిప్పన్‌ తయారు చేశారు. మొత్తం వివరాలను, సరిహద్దులను క్రోడికరించారు. ఆనాటి నుంచి ఈ టిప్పన్లే మనకు ఆధారంగా నిలుస్తున్నాయి. గ్రామాలు, మండలాలు, నగరాలు ఎక్కడైనా సరే.. భూ వివాదాలు తలెత్తినా లేక ఇతర సమస్యలు వచ్చినా భూమి కొలతల రికార్డుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు టిప్పన్‌ ఆధారంగానే హద్దులను చూపిస్తారు. ప్రాజెక్టుల భూసేకరణ, ఈ రికార్డులను నవీకరణ చేయడంలో గత సమైక్య ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని మాయమయ్యాయి. ఈ పరిస్థితులను అవగతం చేసుకున్న ప్రభుత్వం.. భూములకు సంబంధించి కొత్తగా డిజిటల్‌ మ్యాపులు తయారు చేస్తామని వెల్లడించింది. ఇంచు భూమిని కొలిచి, అధునాతన టెక్నాలజీ జోడించి.. వాటికి డిజిటల్‌ కోడ్స్‌ ఇస్తామని ప్రకటించింది. దీని ద్వారా భవిష్యత్‌లో సరిహద్దుల   వివాదాలు రాకుండా ఉండడమేకాదు.. క్రయ విక్రయాలు సులువుగా జరిగేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏటా 2 నుంచి 3వేల వరకు సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం రికార్డులు కొలతల శాఖతోపాటు సర్వేయర్లను అశ్రయిస్తున్న వారి సంఖ్య 1500లకుపై ఉంది. ఒక్కో సర్వేపై సుమారు 20వేలు వెచ్చిస్తున్నారు. ఆ లెక్కన ఏటా 3 కోట్లవరకు సర్వేలపేరుతో ఖర్చుచేస్తున్నారు. 

    ఉద్యోగ భద్రత..  

కొత్త చట్టం ద్వారా వీఆర్వోలు, వీఆర్‌ఏల ఉద్యోగాలు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు. వీఆర్‌ఏలకు తీపి కబురు అందిస్తున్నామని వెల్లడించిన సీఎం.. త్వరలోనే వారికి స్కేల్‌ ఆఫ్‌ వేతనం ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 2,537 మంది వీఆర్‌ఏలు లబ్ధిపొందనున్నారు. ఇదేసమయంలో వీఆర్వోలకు ఉద్యోగ భద్రత ఉంటుందని ప్రకటించారు. అవసరాన్ని బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటుచేస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 620మంది వీఆర్వోలకు ఉద్యోగ భద్రత కల్పించినట్లు అయింది. 

   రైతన్నకు తప్పనున్న తిప్పలు.. 

పంట రుణాల కోసం వెళ్తే బ్యాంకులో పహాణీలు, ఈసీలు తేవాలంటూ బ్యాంకులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. వీటిని తీసుకొని రావడానికి రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. కొత్త చట్టం కింద పూర్తిస్థాయి వివరాలతో ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెనున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సైట్‌లోనే సమస్త చరిత్ర ఉంటుందని వివరించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో ఆరున్నర లక్షల మంది రైతులుంటే.. వారిలో ఐదున్నర లక్షలకుపైగా రుణాలు తీసుకుంటున్నారు. ఇక ముందు వీరికి ఇసీలు, పహాణీల బెడద తప్పనున్నది. ఒక్క క్లిక్‌తో బ్యాంకర్లే సదరు రైతులకు సంబంధించిన సమాచారం చూసుకునే వెసలుబాటు కలుగుతుంది. 

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎదురవుతున్న సమస్యలు 

nఏటా మూడు నుంచి 4వేల గెట్ల పంచాయతీలు వస్తున్నాయి 

nభూ వివాదాలు తగాదాల కింద ఏటా వేయికిపైగా కేసులు ఠాణాల్లో నమోదవుతున్నాయి

nరెవెన్యూ కోర్టుల్లో 12వేలకుపైగా వివిధ రకాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి

nభూ హద్దుల నిర్ధారించుకునేందుకు ఏటా 2 నుంచి 3వేల మంది సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు

nఒక్కో సర్వే కోసం పెడుతున్న ఖర్చు తక్కువలో తక్కువగా 20వేలు అవుతుంది

nసర్వేల కోసం ఏటా వెచ్చిస్తున్న ఖర్చు 5 నుంచి 6 కోట్లు 

nఏటా కోర్టులకు వెళ్తున్న కేసులు 500 నుంచి వెయ్యి వరకు.. 


logo