మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 09, 2020 , 02:24:20

ఆసక్తి ఉన్న వారికి క్రైం బృందాల్లో అవకాశం

ఆసక్తి ఉన్న వారికి క్రైం బృందాల్లో అవకాశం

  •  సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం : నేరాల ఛేదనలో చురుగ్గా పని చేయని వారిని తొలగిస్తూ వారి స్థానాల్లో ఆసక్తి ఉన్న వారిని క్రైం బృందాల్లోకి తీసుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. క్రైం బృందాల్లో పనిచేసే వారికి వాహన సౌకర్యంతో పాటు ప్రత్యేక అలవెన్సులు అందజేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా మంగళవారం హుజూరాబాద్‌ డివిజన్‌ స్థాయిలో జరిగిన సమావేశానికి సీపీ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైం బృందాల్లోకి నూతన పోలీసుల ఎంపిక రెండు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని తెలిపారు. క్రైం బృందాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సంబంధిత ఏసీపీలకు అందజేయాలన్నారు. నేరాల ఛేదనకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతూ తమ సమర్థతను చాటడంతో పాటు పోలీస్‌శాఖ ప్రతిష్ఠను పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పారు. నేరాల ఛేదనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హిస్టరీ షీట్ల కదలికలపై నిఘా ఉంచాలని, బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ విభాగానికి చెందిన పోలీసులు తాము గస్తీ నిర్వహించే ప్రాంతాల్లో పాత నేరస్తులు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఆరా తీయాలని చెప్పారు. రాజీకి వచ్చే కేసులను లోక్‌ అదాలత్‌లో ప్రవేశపెట్టి పరిష్కరించాలన్నారు. మెప్మా విభాగంలో నిధులు దుర్వినియోగంపై కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. ఏ కేసు అయినా మూడు నెలల వ్యవధిలో పూర్తి చే యాలన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు జరిగిన ఆటో మొబైల్‌ దొంగతనాల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని సీసీఆర్‌బీ అధికారులను ఆదేశించారు. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లిలో జరిగిన గొర్రెల అపహరణ కేసును ఛేదించిన వారికి రూ.25వేల నగదు రివార్డును అందజేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు, ట్రైనీ ఐపీఎస్‌ రష్మీ పెరుమాళ్‌, డివిజన్‌లోని పలు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఏసీపీ కార్యాలయంలో మొక్క నాటిన సీపీ

హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయం ఆవరణలో సీపీ కమలాసన్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌ రష్మీ మంగళవారం మొక్కలు నాటారు. ఏసీపీ కార్యాలయం ఆవరణలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో నాటిన వివిద రకాల మొక్కలను పరిశీలించి ఎసీపీ శ్రీనివాసరావును అభినందించారు. హరితహారంలో భాగంగా పోలీసులు ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.  


logo