గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 07, 2020 , 01:44:22

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

  • మానవత్వం చాటుకున్న ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి  

కథలాపూర్‌: మండల కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా, మృతదేహాన్ని తాకేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు భయపడ్డారు. దీంతో ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బాపు లక్ష్మీరాజం (57) మూడు రోజుల క్రితం కథలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు చికిత్సకోసం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అయితే లక్ష్మీరాజం మృతదేహాన్ని కుటుంబసభ్యులు, బంధువులు తాకేందుకు భయపడ్డారు. దీంతో వీరి బంధువైన బాపు బాలకిషన్‌గౌడ్‌ పెగ్గెర్లకు చెందిన అలీబాబాను సంప్రదించాడు. అలీబాబా ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి సంస్థ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లాడు. స్పందించిన సమితి సభ్యులు మతం కన్నా మానవత్వం గొప్పదని, లక్ష్మీరాజం మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా మానవత్వ సమితి సభ్యులను ప్రజాప్రతినిధులు, యూత్‌ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. 


logo