శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 07, 2020 , 01:44:23

ఇదిగో నర్సింగ్‌ కళాశాల

ఇదిగో నర్సింగ్‌ కళాశాల

  • n ఆధునిక హంగులతో ఐదంతస్థుల్లో నిర్మాణం
  • n ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణ
  • n గడువుకు ముందే అందుబాటులోకి..

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కార్మిక, ధార్మిక క్షేత్రాల యువతకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎడ్యుకేషన్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్‌, ఐటీఐ, అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌ మంజూరు చేయించారు. వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పనులు తంగళ్లపల్లి మండలంలో ని జిల్లెల్లలో చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రం లో 259 కోట్లతో 300 పడకలు, వేములవాడ పట్టణంలో 100 పడకల ప్రత్యేక దవాఖాన మం జూరు చేయించారు. వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఏరి యా దవాఖానలో నెలకు 30 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. ఈ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలంటే తగినంత నర్సింగ్‌ సిబ్బంది ఉండాలి. ఆ ఉద్దేశంతో సిరిసిల్లకు ప్రత్యేకంగా నర్సింగ్‌ కళాశాలను మంత్రి కేటీఆర్‌ మం జూరు చేయించారు. 2017 ఆగస్టులో మంజూరైన కళాశాల విద్యానగర్‌లోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తూ తరగతులు ప్రారంభించారు. బైపాస్‌ రోడ్డులో ఐదెకరాల భూమి కేటాయించి, ఏడాది క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. 

ఆధునిక హంగులతో భవనం 

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల రాష్ర్టానికే ఆదర్శంగా ఉండేలా పనులు జరుగుతున్నాయి. అందమైన డిజైన్‌తో కోట్ల విలువైన 5.2 ఎకరాల స్థలంలో 27.77 కోట్లతో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో, రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సమీపంలో కళాశాలను నిర్మిస్తున్నారు. విద్యార్థినుల తరగతుల కోసం రెండంతస్థులు చేస్తున్నారు. 5 ప్రయోగశాలలు, అధ్యాపకుల కోసం 4 ప్రత్యేక గదులు, 4 ల్యాబ్‌లు, టాయిలెట్లు నిర్మిస్తున్నారు. 500 మంది విద్యార్థులు ఒకేసారి సమావేశం నిర్వహించుకునేలా విశాలమైన ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల భవన నిర్మాణ పనులపై కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులంతా పనులను పర్యవేక్షిస్తున్నారు. 

సకల సౌకర్యాలు.. 

ఇంటర్‌ నుంచి ఈ నర్సింగ్‌ కళాశాలలో చేరవచ్చు. ఇందులో కేవలం బాలికలకు మాత్రమే ప్రవేశం. నాలుగేండ్ల కోర్సు ఉంటుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 400మంది ఉండే లా కళాశాల పక్కనే వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఐదంతస్థులు, అన్ని వసతులు, ఆధునిక హంగులతో 105 గదులు కడుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి రాత్రీపగలు ఇద్దరు చొప్పున నలుగురు వాచ్‌మెన్లను నియమించనున్నారు. కళాశాల నుంచి జిల్లా ప్రధాన వైద్యశాలకు విద్యార్థినులను తీసుకెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయనున్నారు.  

ప్రారంభానికి సన్నాహాలు.. 

2017లో కళాశాల మంజూరైంది. 2018లో కళాశాలకు అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌తో మొత్తం సీట్లను ప్రభుత్వం భర్తీ చేసింది. అక్టోబర్‌లో ప్రైవేట్‌ భవనంలో కళాశాలను ప్రారంభించారు. విద్యానగర్‌లో మూడంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. కొత్తగా చేరే విద్యార్థినులకు వసతి కొరత ఏర్పడనున్నందున ఈ నవంబర్‌లోనే భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణ పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పూర్తి చేయాల్సి ఉన్నా గడువుకు ముందే పనులు పూర్తి చేసి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కాంట్రాక్టర్‌ పనుల్లో వేగం పెంచారు. నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన నవతేజ. ఇన్‌ ప్రాస్ట్రక్చర్‌ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్టుకు ఇచ్చింది. డబుల్‌ బెడ్రూం, వ్యవసాయ కళాశాల భవనాలను ఈ సంస్థనే నిర్మించింది. నవంబర్‌లో నర్సింగ్‌ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున తరగతులు నిర్వహించుకునేలా గదుల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలోగా మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ప్రస్తుతం కళాశాలలో వంద మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. జిల్లాకు చెందిన విద్యార్థినులతోపాటు వరంగల్‌, అదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లా ల విద్యార్థులూ ఉన్నారు. భవన నిర్మాణం పూర్తయితే విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి.logo