మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 06, 2020 , 02:35:24

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

  • n కరీంనగర్‌ బల్దియా మీటింగ్‌ గరంగరం
  • n పలు అభివృద్ధి పనులపై చర్చ, ఆమోదం
  • n హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌
  • n త్వరలో 24గంటలు నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడి
  • n పారదర్శకంగా పని చేస్తాం : మేయర్‌ సునీల్‌రావు

కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మేయర్‌ వై.సునీల్‌రావు అధ్యక్షతన వాడీవేడిగా సాగింది. వివిధ అంశాలపై సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు కొనసాగాయి. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి నివా ళులర్పించారు. అనంతరం చర్చ ప్రారంభం కాగా, బీజేపీ కార్పొరేటర్లు బల్దియా చేపడుతున్న పలు పనుల్లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్పం దించిన మేయర్‌ సునీల్‌రావు ఆధారాలతో నిరూపిస్తారా? అంటూ ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను కొట్టిన చర్రిత బీజేపీదని టీఆర్‌ఎస్‌ సభ్యు లు విమర్శించారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ కార్పొరేటర్లు సభకు క్షమాపణ చెప్పాలంటూ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. ఇందు కు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా బైటాయించారు. స్పందించిన మేయర్‌ ఆరోపణలు చేసిన బీజేపీ కార్పొరేటర్లు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశాలకు మీడియాను అనుమతించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సమావేశంలో సుమారుగా రూ.50 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశం ఉదయం నుం చి సాయంత్రం వరకు సాగింది. అభివృద్ధి విషయంలో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రతి పక్ష సభ్యులు కోరారు. శివా రు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేలా తాము పని చేస్తున్నామని మేయర్‌ తెలిపారు. నగరం లో చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం, కొవి డ్‌-19 నియంత్రణకు చేపట్టిన పనులకు సభ అనుమతి ఇచ్చింది. ఏళ్ల తరబడి బల్దియాలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదని సభ్యులు పేర్కొన్నారు. 60ఏళ్లు దాటిన కార్మికులను తొలగిస్తే వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలకు ఎల్‌ఆర్‌ఎస్‌, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్లు కేటాయించకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులే కేటయించడం అన్యాయమని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

త్వరలో 24గంటలు నీటి సరఫరా   - మంత్రి గంగుల కమలాకర్‌

నగరంలో ఇప్పటికే రోజూ నీటి సరఫరా చేస్తున్నామని, త్వరలోనే 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు వ్యక్తిగత దూషణలకు పోకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. నగరపాలక సంస్థ నుంచే తాను మంత్రిగా, బండి సంజయ్‌కుమార్‌ ఎంపీగా ఎదిగామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా నగరపాలక సంస్థకు ఇప్పుడు నిధులు వచ్చాయన్నారు. మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజలు పాలకవర్గంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కార్పొరేటర్లు పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే తాము ముందుకు సాగుతున్నామన్నారు. 

పారదర్శకంగా పని చేస్తాం - నగర మేయర్‌ వై.సునీల్‌రావు

నగరంలో జవాబుదారీతనం, పారదర్శకంగా అభివృద్ధి చేసి చూపుతామని మేయర్‌ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఆమోదం తెలిపిన పనులను అక్టోబర్‌లో ప్రారంభించి డిసెంబర్‌ నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. పట్టణ ప్రగతి నిధులతో ప్రజలందరికీ ఉపయోగపడేలా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులకు నిధులు కేటాయించేలా చూస్తామన్నారు. ప్రజలు మెచ్చుకునేలా తాము పని చేస్తామని పేర్కొన్నారు. 


logo