గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 03, 2020 , 01:46:02

వైద్యుల సేవలు అభినందనీయం

వైద్యుల సేవలు అభినందనీయం

  •   n జాగ్రత్తలు తీసుకుంటూ  కరోనా  బాధితులకు చికిత్స అందించాలి
  •  n కలెక్టర్‌ శశాంక
  •  n ప్రభుత్వ దవాఖాన తనిఖీ

కరీంనగర్‌ హెల్త్‌ : ప్రభుత్వ దవాఖానలో సాధారణ రోగులతో పాటు కరోనా బాధితులకు వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు బాగున్నాయని కలెక్టర్‌ శశాంక అభినందించారు. బుధవారం ఆయన ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీపీఈ కిట్‌ ధరించి దవాఖానలోని సాధారణ వార్డులతో పాటు  కొవిడ్‌-19 వార్డులను పరిశీలించారు. కరోనా బాధితులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. డాక్టర్లు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలని రోగులకు సూచించారు. వైద్యులు చికిత్స చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు, గ్లౌసులు ధరించాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో వైద్యసేవల కోసం వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వస్తే అవసరమైన మందులు ఇచ్చి, హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించాలని చెప్పారు. అనంతరం దవాఖాన ఆవరణ, వార్డులు, పరిసరాలు, మూత్రశాలలను పరిశీలించి ఎలాంటి వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల మాట్లాడుతూ కొవిడ్‌-19 వార్డుకు ఒకే ప్రవేశ మార్గాన్ని కేటాయించామని, దవాఖాన రెండో అంతస్తులో 93 పడకల ఐసొలేషన్‌ వార్డు, 93 ఆక్సిజన్‌ పాయింట్లు గల కొవిడ్‌-19 వార్డుగా నామకరణం చేసినట్లు తెలిపారు. టెలివిజన్‌, సీసీ కెమెరాల సౌకర్యం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా అదనంగా 16 పేయింగ్‌ గదులు, 37 పడకలు పురుషుల సర్జికల్‌ వార్డు, 34 పడకల చిన్న పిల్లల వార్డులను కొవిడ్‌-19 వార్డులుగా మార్చినట్లు తెలిపారు. మొత్తం 180 పడకలు కొవిడ్‌ బాధితులకు చికిత్స చేసేందుకు అందుబాటులో ఉన్నాయని, వాటిలో వెంటిలేటర్‌ పడకలు 25, ఆక్సిజన్‌ పడకలు 150, సాధారణ పడకలు 5 ఉన్నట్లు కలెక్టర్‌కు వివరించారు. 23 మంది డాక్టర్లు, 99 మంది స్టాఫ్‌ నర్సులను 24 గంటలు పని చేసేందుకు నియమించినట్లు చెప్పారు. కరోనా బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు, పౌష్టికాహారం, పండ్లు, గుడ్లు, స్నాక్స్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 6023 మంది రోగులు రాగా అందులో 830 మంది ఇన్‌ పెషెంట్లుగా చికిత్స పొందిన వారిలో 689 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. 10,847 మందికి ఆర్‌ఐపీసీఆర్‌ పరీక్షలు చేశామని, అందులో 2337 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 1854 మందికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేయగా 284 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo