గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 03, 2020 , 01:46:04

‘చల్మెడ’లో ప్లాస్మా థెరపీ

‘చల్మెడ’లో ప్లాస్మా థెరపీ

  • lకరీంనగర్‌ జిల్లాలో మొదటి సారి   సేవలను ప్రారంభించిన వైద్యులు
  • l కరోనా బాధితులు   సద్వినియోగం చేసుకోవాలి:   చైర్మన్‌ లక్ష్మీనరసింహారావు

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

కరోనా బాధితులకు చల్మెడ వైద్య, విజ్ఞాన సంస్థ అనుబంధ దవాఖానలో బుధవారం నుంచి ప్లాస్మా థెరపీ అందుబాటులోకి వచ్చింది. కరోనాతో బాధపడుతున్న ఓ రోగికి జిల్లాలోనే మొదటి సారి ప్లాస్మా థెరపీ చేశారు. ఇది వరకు కొవిడ్‌ బారినపడి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా సేకరించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగికి చికిత్స అందిస్తూ వైద్యులు మంచి ఫలితాలు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వీ కరుణాకర్‌ రావు నుంచి ప్లాస్మాను సేకరించిన చల్మెడ వైద్యులు, ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతూ పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి ఎక్కించారు. ఈ చికిత్స విధానం ద్వారా రోగి రక్తంలో ప్లాస్మా కలిసి యాంటీబాడీస్‌ పెరుగడం వల్ల కరోనా నుంచి కోలుకోగలుగుతారని చల్మెడ వైద్యులు తెలిపారు. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలకు సేవలందిస్తున్న చల్మెడ దవాఖానలో ప్లాస్మా థెరపీ కూడా ప్రారంభం కావడంతో కరోనా బాధితులకు మెరుగైన సేవలందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చల్మెడ వైద్య, విజ్ఞాన సంస్థ చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనరసింహా రావు మాట్లాడుతూ, ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కరుణాకర్‌ రావును అభినందించారు. ఇలా ఇది వరకే కరోనాకు చికిత్స పొంది కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు వస్తే చాలా మంది రోగులను రక్షించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


logo