ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 01, 2020 , 02:25:25

పన్నులు సకాలంలో వసూలు చేయాలి

పన్నులు సకాలంలో వసూలు చేయాలి

  • n డీపీవో వీరబుచ్చయ్య

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ప్రతి గ్రామపంచాయతీలో పన్నులు సకాలంలో వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో మండల పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులతో పాటు రోడ్డుకిరువైపులా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్మించే డంప్‌ యార్డు, శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్‌ల నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు. అలాగే హరితహారం, పల్లె ప్రకృతి వనాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయతీల రికార్డులను పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. గ్రామ పంచాయతీలో నాలుగు సంవత్సరాల ప్రణాళికను తయారు చేసి పంపించాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని, లేని యెడల జరిమానా విధించాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo