సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 31, 2020 , 01:03:23

‘ఉపకార’ సాయం

‘ఉపకార’ సాయం

కార్పొరేషన్‌: పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల వరకు ప్రభుత్వం నుంచి ఈ ఉపకార వేతనాలు అందుతాయి. ఈ ప్రతిభ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు చేసుకునేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 4వ తేదీలోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఉంది. 

విద్యార్థులకు ఏటా రూ.12వేలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ ప్రతిభా పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12వేలను ఆర్థిక సాయంగా అందజేస్తారు. ఉన్నత చదువుల కోసం అందించే ఈ సాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.

అర్హులు వీరే..

ప్రభుత్వ, జడ్పీ ఎయిడెడ్‌, హాస్టల్‌ లేని ఆదర్శ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏటా రూ.1.50 లక్షలకు మించకూడదు. ఏడో తరగతిలో బీసీ, ఓసీ విద్యార్థులకు 55శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50శాతం మార్కులు సాధిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. 

 దరఖాస్తు ఇలా..

దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. www.bse.telangana.gov.in లో  సమర్పించాలి. దరఖాస్తుతోపాటుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతచేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను విద్యార్థులు అక్టోబర్‌ 4వ తేదీలోగా చేసుకోవాలి. 5న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత దరఖాస్తును జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి.


logo