శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 31, 2020 , 00:17:14

‘పుర’ సేవలు మరింత చేరువ

‘పుర’ సేవలు మరింత చేరువ

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించే బాధ్యత మున్సిపాల్టీ అధికారులు, పాలకవర్గ సభ్యులపై ఉన్నది. ఇదివరకు పట్టణ ప్రజలు తమ సమస్యలపై వార్డు కౌన్సిలర్లకో లేదా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేవారు. కౌన్సిలర్ల దృష్టికి సమస్య తీసుకెళ్లినా తమకు ఓటు వేయలేదన్న కారణంతో గానో ఇతర కారణాలతో వారి సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వార్డుకు ఒక అధికారిని నియమిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉన్నదని భావించింది. మున్సిపల్‌లో కొంత మేర సిబ్బంది కొరత ఉండడంతో త్వరనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటన చేశారు. త్వరలోనే వార్డుకో అధికారి నియామకం కానున్న నేపథ్యంలో ప్రజలకు మరింత వేగంగా సేవలందే అవకాశం ఉన్నది. 

సేవలు మరింత చేరువ

మున్సిపల్‌ కొత్త పాలకవర్గాలు అధికారం చేపట్టి ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నది. దీంతో ప్రభుత్వం కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే ఆయా మున్సిపల్‌ పరిధిలోని ఉన్న అక్రమ కట్టడాల నియంత్రణకు భువన్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పట్టణాల్లోని అన్ని వ్యాపార, గృహ సముదాయాలను జియో ట్యాగింగ్‌ చేసి ఆస్తి పన్ను పరిధిలోకి తేనున్నారు. దీంతో మున్సిపల్‌కు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం వన్‌టైం స్కీంను ప్రవేశపెట్టి వడ్డీపై 90శాతం మాఫీ చేయాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరాగాల్సిన అవసరం లేకుండా టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

కీలకంగా వార్డు అధికారి

ప్రతి వార్డుకో కౌన్సిలర్‌ మాదిరిగా అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వార్డు అధికారి ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వార్డు అధికారిదే. పథకాలు ప్రజలకు అందుతున్నాయా..? లేదా..? క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. స్థానిక కౌన్సిలర్‌/కార్పొరేటర్‌, నాయకులు, కాలనీవాసులను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలి. అన్నీతానై వార్డు సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా పనిచేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నగరపాలక సంస్థలతో పాటు 14 మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు కలిపి  మొత్తం 461 ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో డివిజన్‌ లేదా వార్డుకో అధికారిని నియమిస్తే మొత్తం 461 మంది అవసరం అవుతారు. దీంతో పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో వీరు కీలకంగా మారనున్నారు. 


logo