బుధవారం 30 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 30, 2020 , 02:24:47

మెరుగైన సేవలందించేందుకు కృషి

మెరుగైన సేవలందించేందుకు కృషి

  • lఎంత ఖర్చయినా వెనకాడం lరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల 
  • lడీఆర్‌ఎఫ్‌ వాహనాలు ప్రారంభించిన అమాత్యుడు

కార్పొరేషన్‌ : నగర, పట్టణ ప్రజలకు గతం కంటే భిన్నంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌)కు సంబంధించి నూతనంగా వచ్చిన వాహనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో ఆధునీకరణ జరగాలని, మెరుగైన సేవలు అందించాలన్న ఆలోచనతోనే అనేక సంక్షేమ, సంస్కరణలు కూడా తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలన్న తీరులో బల్దియా పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ ముందంజలో ఉందన్నారు. నగర ప్రజలు ఫోన్‌ చేసిన వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు డీఆర్‌ఎఫ్‌ విభాగాన్ని బల్దియాలో ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా శనివారం రెండు వాహనాలను ప్రారంభించామని, మరో వాహనం రెండు రోజుల్లో వస్తుందన్నారు. వీటితో పాటుగా 40 మంది ఉద్యోగులు మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా ఈ విభాగం వెంటనే స్పందించి పనులు చేపడుతుందన్నారు. నగరంలో రోజూ ఫాగింగ్‌ చేసేందుకు మరో రెండు మిషన్లను తీసుకువస్తున్నామని, ఇప్పటికే మూడు ఉన్నాయని తెలిపారు. మానేరు డ్యాం పక్కనే ఉన్నా నీటి సరఫరాకు ఇబ్బంది ఉండేదని, ప్రస్తుతం ప్రతిరోజూ నగరంలో మంచినీటి సరఫరాను మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే 24 గంటల తాగునీటి సరఫరా అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం, నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై.సునీల్‌రావు, సీపీ కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo