ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 28, 2020 , 02:35:02

పండంటి వ్యాపారం

పండంటి వ్యాపారం

  • కరోనా కాలం.. జోరుగా పండ్లు, కూరగాయల వ్యాపారం
  • lవీధివీధినా స్టాళ్లు.. ఇండ్ల వద్దకే సరఫరా
  • lనిరుద్యోగులకు ఉపాధి.. చిరువ్యాపారులకు మేలు
  • lరోజుకు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు లాభం 

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పండ్లు, కూరగాయల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఒకప్పుడు మార్కెట్లకే పరిమితమైన ఈ బిజినెస్‌ వీధివిధినా వర్ధిల్లుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏ గల్లీకి వెళ్లినా పండ్లు, కూరగాయల స్టాళ్లు దర్శనమిస్తున్నాయి. ఆటో ట్రాలీల్లో మైక్‌పెట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ విక్రయించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మూసేశారు.  అడపాదడపా తెరిచినా బయటి ఆహార పదార్థాలు తినాలంటేనే జనం జంకుతున్నారు. చాలా మంది ఇంట్లోనే వంట చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో పండ్లు, కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది..

ఇండ్ల వద్దకు సప్లయ్‌..

కరోనా దెబ్బకు జనాలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో నిత్యావసరాలైన కూరగాయలు, పండ్లు వ్యాపారాలు వీధివీధినా వెలిశాయి. ఈ నేపథ్యంలో కొందరు యువకులు ఫోన్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ ఇంటింటికీ అందజేస్తున్నారు. పెట్టుబడి సైతం తక్కువే కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు కిరాణా దుకాణాదారులు సైతం పండ్లు, కూరగాయలు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయాన్నే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలను తక్కువ ధరలకు హోల్‌సేల్‌గా కొనుగోలు చేయడం.. ఓ విధి చివర కొంత గిట్టుబాటు ధరకు అమ్మడం,   ఇంటి నుంచి బయటికి రానివారి ఇళ్లకు వెళ్లి విక్రయించడం.. మిగిలిన వాటిని ఇంట్లోకి వాడుకోవడం, కొన్ని వారివారి బంధువులు, శ్రేయోభిలాషులకు పంపించడం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరికీ అనువుగా ఉండడం వల్ల పండ్లు, కూరగాయల్లో వెల్లుల్లి, ఆలుగడ్డ, కొత్తిమీర, పూదీన వంటివి తెచ్చుకొని రోడ్లపైన అమ్మేవారి సంఖ్య పెరిగింది. పైగా పనిలేదనే సమస్య లేకుండా వీటి అమ్మకాల ద్వారా రోజుకు రూ.800 నుంచి వెయ్యి దాకా సంపాదిస్తున్నారు.

ధర పెరిగినా కొంటున్నరు..

ఈ సంవత్సరం పండ్లు బాగా అమ్ముడుపోతున్నయ్‌, ఎక్కువగా బత్తాయి, దానిమ్మ, గ్రీన్‌ ఆపిల్‌, బొప్పాయి పండ్లు కొనుక్కుంటున్నరు. కాకపోతే ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరగడం వల్ల పండ్ల ధరలు స్వల్పంగా పెరిగినయ్‌. అయినప్పటికీ అమ్మకాలు బాగానే జరుగుతున్నయ్‌..

-బరాయిల్ల రవి, పండ్ల వ్యాపారి

అమ్మకాలు తగ్గలె.. 

రవాణా చార్జీలు పెరగడంతో పండ్ల ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. కరోనా వల్ల పండ్లు, ఫలాలు ఎక్కువగా తినాలని వైద్యులు చెబుతున్నందున గిరాకీ పెరిగింది.. కొంత మంది తోపుడు బండ్లతో గల్లీలకు వెళ్లి అమ్ముకుంటున్నరు. 

- జెట్టి సత్తయ్య, పండ్ల వ్యాపారి

ఊర్లోనే  కూరగాయలు అమ్ముతున్న..

నేను ముంబైలో ప్రైవేటుగా ఉద్యోగం చేసేటోన్ని. కరోనా వచ్చిన తర్వాత అక్కడ కేసులు బాగా నమోదైనయ్‌. అందుకే అక్కడి నుంచి వచ్చిన. ధర్మపురిలోనే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి, ఇక్కడకు తెచ్చి విక్రయిస్తున్న. లాభాలు భాగానే వస్తున్నయ్‌. సొంత ఊర్లోనే ఉపాధి పొందడం సంతృప్తి కలుగుతున్నది. 

- ఎనుగుల క్రాంతి, ధర్మపురి

గిరాకీ బాగా పెరిగింది..

కరోనా కేసులు పెరగడం వల్ల జనం హోటల్‌ తిండి మానేసిన్రు. ఇంట్లోనే పలురకాల శాకాలు వేసుకొని తృప్తిగా భుజిస్తున్నరు. దీని వల్ల కూరగాయల గిరాకీ బాగా పెరిగింది. ఇంట్లోనే వెరైటీలు తయారు చేసుకోవడం వల్ల కూరగాయల కొనుగోళ్లు బాగా పెరిగినయ్‌. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నయ్‌. లాభాలు బాగానే వస్తున్నయ్‌.

- రాజారపు గుండయ్య, కూరగాయల వ్యాపారి (ధర్మపురి)logo