గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 25, 2020 , 03:48:35

‘స్మార్ట్‌సిటీ’కి నిధులివ్వండి

‘స్మార్ట్‌సిటీ’కి నిధులివ్వండి

కార్పొరేషన్‌: కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులు మరింత ముమ్మరంగా సాగేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్‌శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌కు మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంత్రి కేటీఆర్‌తో కలిసి వినోద్‌కుమార్‌ వినతి పత్రాన్ని అందజేశారు. రూ.206కోట్ల విలువ జేసే 11పనుల డీపీఆర్‌, రూ.235 కోట్ల విలువ చేసే 9 పనుల డీపీఆర్‌లు వివిధ దశల్లో ఉన్నాయని, త్వరలోనే ఈ నివేదికను కేంద్ర మంత్రికి అందజేస్తామని వినోద్‌కుమార్‌ తెలిపారు. రూ.330 కోట్లతో కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులు సాగుతున్నాయని, అందులో మొదటి దఫా విడుదలైన రూ.196 కోట్లలో ఇప్పటికి రూ.78.64 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ పనులు మరింత వేగవంతంగా కొనసాగేందుకు మిగతా నిధులు వెంటనే విడుదల చేసి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. నిబంధనల ప్రకారం స్మార్ట్‌సిటీ ఎంపిక జాబితాలో కరీంనగర్‌ నగరానికి అవకాశాలు లేకుండాపోయిన సందర్భంలో ఎంపీగా ప్రత్యేక శ్రద్ధ చూపి సీఎం కేసీఆర్‌తో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాయించి పేరును చేర్పించినట్లు వినోద్‌కుమార్‌ వివరించారు.

కరీంనగర్‌లో గ్రీన్‌ కారిడార్‌

కరీంనగర్‌ సుందరీకరణలో భాగంగా అల్గునూర్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం పద్మనగర్‌ వరకు రూ. 120 కోట్లతో 4.4 కిలోమీటర్ల మేర గ్రీన్‌ కారిడార్‌ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వినోద్‌కుమార్‌ తెలిపారు. సమగ్ర కార్యాచరణకు నివేదికను పూర్తి చేసి త్వరలోనే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు, కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ అందజేయనున్నట్లు  ఆయన వివరించారు.logo