గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 24, 2020 , 01:39:40

మార్కెట్లకు మంచిరోజులు

మార్కెట్లకు మంచిరోజులు

వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు మంచి రోజులు రానున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయ కేంద్రాలుగా ఉన్న ఇవి, ఇక నుంచి నేరుగా ఐకేపీ, పీఏసీఎస్‌ తరహాలో గ్రామాల్లో కొనుగోళ్లు చేపట్టనున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చని, క్రయవిక్రయాలకు సంబంధించిన సెస్‌(మార్కెట్‌ ఫీజు)ను చెల్లించనవసరం లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ఆదాయానికి గండిపడకుండా ఉండేందుకు సరికొత్త ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ నిర్ణయంపై కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ల పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.     

  జమ్మికుంట/ చొప్పదండి : రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్‌ వ్యవస్థ ఏర్పడింది. అప్పటి నుంచి రైతుకు మద్దతు ధరలు లభిస్తున్నాయి. దళారుల బాధ తప్పుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాతకు పెద్దపీట వేసింది. మార్కెట్‌లోనే కాకుండా నేరుగా మిల్లుల వద్ద కూడా మద్దతు ధరలకు విక్రయించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలు చెల్లించిన చోట అమ్ముకునేవారు. ఎమ్మెస్పీ తగ్గితే అధికారులకు ఫిర్యాదు చేసేవారు. న్యాయం జరిగేలా అధికారులు, మార్కెట్‌ పాలకవర్గం చూసుకునేది. అయితే, మార్కెట్లో అమ్ముకున్నా.. నేరుగా మిల్లుల్లో విక్రయించినా.. మార్కెట్‌ ఫీజు రూ.1(వందకు)చెల్లించాలని ఆదేశాలున్నాయి. అలా ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే మార్కెట్లకు యేటా రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. సంక్షేమ మార్కెట్లు సెస్‌ల రూపంలో వచ్చిన ఆదాయంతో రైతులకు కనీస సౌకర్యాలు అందించేవారు. అధికారులు, సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు జీతాలతో పాటు రైతులకు, కార్మికులకు బీమా సదుపాయం కల్పించేవారు. హెల్త్‌ క్యాంపులు నిర్వహించేవారు. అభివృద్ధి పనులు చేయించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్ని వర్గాలకు మార్కెట్లు సంక్షేమ నిలయాలుగా మారాయి. అలాంటి మార్కెట్‌ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందులకు గురిచేసింది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు.. మార్కెట్‌ ఫీజులు రద్దు చేస్తున్నట్లు జూన్‌ 05, 2020న జీవో జారీ చేసింది. ఇది రైతులకు మేలే కావచ్చుకానీ, మార్కెట్‌పై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌, తదితర వర్గాలను ఆందోళన కలిగించింది. రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ల మూసివేతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు మార్కెట్‌ వ్యవస్థపై ఆధారపడి ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు, మార్కెట్‌ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు, పాలకవర్గం సమన్వయంతో కొనుగోళ్లు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 5న ఏపీసీ అండ్‌ కార్యదర్శి డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లూ ఐకేపీ, పీఏసీఎస్‌, తదితర ప్రభుత్వరంగ సంస్థలు ఎలా అయితే కొనుగోలు చేశాయో.. అదే విధంగా ఈ సీజన్‌ నుంచి మార్కెట్లు కూడా మద్దతు ధరలతో నేరుగా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు గ్రీన్‌ సిగ్నలిచ్చారు. దీంతో మార్కెట్లకు కొనుగోళ్లపై కమీషన్‌ రానుంది. మళ్లీ ఆదాయం సమకూరనుంది. సర్కార్‌ నిర్ణయంపై ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బాగుంది కేంద్ర నిర్ణయం కొంత ఆందోళన కలిగించింది. మార్కెట్లు మూతపడుతయా? అనిపించింది. వాటి మీద ఆధారపడే కుటుంబాల పరిస్థితి ఏంటనే..? ప్రశ్నలు వచ్చాయి. పరేషాన్‌లో పడ్డం. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లే ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయాలనే తీసుకున్న నిర్ణయం బాగుంది. అన్ని వర్గాలకు ఊరట కలిగించే విషయం. సంతోషమైంది. ఈ మధ్యనే జీవో వచ్చింది. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తం. మద్దతు ధరలతో కొంటం. కమీషన్‌తో ఆదాయం వస్తది.

- పొనగంటి శారద, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, జమ్మికుంట 


logo