శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 24, 2020 , 01:39:39

‘మానేరు’ పరవళ్లు

‘మానేరు’ పరవళ్లు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోయతుమ్మెద వాగు ఉప్పొంగడంతో మానేరు పరవళ్లు తొక్కింది. నాలుగేళ్ల తర్వాత ఎల్‌ఎండీ జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు ఉరకలెత్తింది. శనివారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి, మూడు గేట్లు ఎత్తడంతో నీరు కిందికి దుంకింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, 23 టీఎంసీలు చేరడంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ అధికారయంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు డ్యాం గేట్లు తెరుస్తున్నట్లు సమాచారం తెలియడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కాగా, రాత్రంతా నీటి విడుదల కొనసాగగా, ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆదివారం ఉదయం గేట్లు మూసేశారు.  

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/తిమ్మాపూర్‌):భారీ వర్షాల కారణంగా ఎల్‌ఎండీ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం వరకు మోయతుమ్మెద వాగు ద్వారా సుమారు 26 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు జలాశయంలోకి 23 టీఎంసీల నీరు చేరడంతో వరద మరింత పెరగవచ్చని భావించిన అధికారులు మంత్రి గంగుల కమలాకర్‌కు సమాచారం అందించారు. ఆయన సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నీటిని విడుదల చేసేందుకు అనుమతి పొందారు. ఈ మేరకు 10వ గేటు వద్ద జలాభిషేకం చేసి, చీరసారె సమర్పించిన స్విచ్‌ ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 9,11 గేట్లను కూడా ఎత్తారు. ఈ మూడు గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి క్రమంగా ఇన్‌ఫ్లో తగ్గడంతో అర్ధరాత్రి రెండు గేట్లను అధికారులు మూసేశారు. మరో గేటును ఆదివారం ఉదయం మూసేశారు.

స్థిరంగా ఎల్‌ఎండీ నీటి మట్టం

ఎల్‌ఎండీ నీటి మట్టం ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి జలాశయంలో 23.076 టీఎంసీల నీరు ఉంది. ఉదయం 2,300 క్యూసెక్కులు మాత్రమే ఉన్న వరద మధ్యాహ్నం వరకు 14,612 క్యూసెక్కులు వచ్చింది. సాయంత్రానికి మళ్లీ 3,263 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో జలాశయం నీటి మట్టం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

తాగు, సాగు నీటికి ఢోకా లేదు- మంత్రి గంగుల కమలాకర్‌

బీడు భూములు సైతం కాళేశ్వరం జలాలతో సాగులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి ఢోకా లేదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఎల్‌ఎండీ గేట్లు తెరిచిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, వీటికి భారీ వర్షాలు తోడుకావడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. కాగా, శనివారం సాయంత్రం వరకు మోయతుమ్మెద వాగు నుంచి 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఎల్‌ఎండీలో నీటి సామర్థ్యం 23 టీఎంసీలు దాటిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు తెలుపగా నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. గాలి, భూమి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌ను ప్రజలు మరిచిపోలేరని తెలిపారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా చుట్టూ జలాశయాలు ఉండడంతోపాటు అవి పూర్తిస్థాయిలో నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇక భవిష్యత్‌లో రైతుల ఆత్మహత్యలు ఉండవని స్పష్టం చేశారు. మానేరు పరీవాహక ప్రాంతం నుంచి రిజర్వాయర్‌కు వచ్చే వరదను గంట గంటకూ అధికారులు సమీక్షిస్తున్నారని, ఆ మేరకు గేట్ల ఎత్తివేత, మూసివేతపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మానేరు వాగులో ఎవరూ ఉండకుండా, దిగువ ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, జిల్లా యంత్రాంగం ద్వారా తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, నగర మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి హరిశంకర్‌, ఎస్సారెస్పీ జీవీసీ-4 ఎస్‌ఈ శివకుమార్‌, ఈఈ శ్రీనివాస్‌, ఆర్టీఏ సభ్యుడు తోట శ్రీపతిరావు, కార్పొరేటర్లు రాజేందర్‌రావు, బండారి వేణు, దిండిగాల మహేశ్‌, ఐలేందర్‌ యాదవ్‌, నాయకులు నందెల్లి మహిపాల్‌, సుంకిశాల సంపత్‌రావు, ఎస్సారెస్పీ డిప్యూటీ ఈఈలు సమ్మయ్య, సురేశ్‌కుమార్‌, ఏఈఈ అంజుమున్నీసా, ఏఈలు కాళిదాసు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి 

శనివారం సాయంత్రం గేట్లు తెరుస్తున్న విషయం తెలుసుకున్న నగర వాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డ్యాం పరిసరాలకు చేరుకుని సందడి చేశారు. గేట్లు తెరిచిన తర్వాత నీటిని చూసేందుకు ఉత్సాహం చూపారు. 2016 తర్వాత అంటే నాలుగేళ్లకు తిరిగి గేట్లు తెరుచుకోవడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి  వచ్చి మానేరు అందాలను తిలకించారు. నీటి విడుదలతో మానేరు వాగు దిగువన జలకళను సంతరించుకుంది. వంతెన మీదుగా చాలా మంది నీటి పరవళ్లను చూసి పరవశించిపోయారు.


logo