మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 22, 2020 , 01:36:59

ప్రగతి పరుగులు..

ప్రగతి పరుగులు..

తొలగుతున్న ‘అంతిమ’ కష్టాలు...

ఒకప్పుడు గ్రామాల్లో ఎవరైనా మృతిచెందితే దహన సంస్కారాలకు కనీసం సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఆ సమస్య చాలా వరకు తీరింది. ప్రతి గ్రామంలో ప్రభుత్వం వైకుంఠ ధామం(శ్మశాన వాటిక) నిర్మాణం చేపట్టింది. మండలంలో 23 పంచాయతీలు ఉండగా, ఏడు చోట్ల పంచాయతీ రాజ్‌ కింద, మిగతా 16 గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు వేగంగా సాగుతున్నాయి. మృతుల బంధువులు కూర్చుకునేందుకు ప్రత్యేకమైన గద్దెలు, స్నానానికి, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, బోరుపంపులు, నీటి ట్యాంకులతోపాటు పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని వాతావరణంలో వైకుంఠధామాలు రూపుదిద్దుకుంటున్నాయి.

వెల్లివిరుస్తున్న పచ్చదనం...

హరితహారం కోసం మండలంలోని ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో లక్షల మొక్కలను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు అవసరమైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఆరో విడుతలో ఇప్పటి దాకా 96 వేల మొక్కలను ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో, రోడ్ల పక్కన, అటవీ ప్రాంతంలో నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.

ఊరూ వాడా పరిశుభ్రం...

ప్రతి పంచాయతీలో ప్రభుత్వం డంప్‌ యార్డులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉపాధి హామీ పథకం కింద రూ.2.50 లక్షలు నిధులు వెచ్చించి వీటిని ఏర్పాటు చేశారు. పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను ముందుగా కంపోస్ట్‌ షెడ్లకు తరలించి తడి, పొడి వేరు చేస్తారు.   తర్వాత ప్లాస్టిక్‌, వ్యర్థాలను ఇక్కడకు తరలిస్తున్నారు. 

చెత్తతో ఆదాయం..

ఉపాధిహామీ పథకం ద్వారా రూ. రెండున్నర లక్షల వ్యయంతో ప్రతి గ్రామంలో కంపోస్ట్‌ షెడ్డు నిర్మిస్తున్నారు. 30ఫీట్ల పొడవు, 23ఫీట్ల వెడల్పు, రేకుల పైకప్పుతో ఉండే దీనిలో ప్రత్యేక అర్రలను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది గ్రామంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తెచ్చి తడి, పొడి, ప్లాస్టిక్‌ వేరు చేస్తారు. కంపోస్ట్‌ ఎరువును సిద్ధం చేస్తారు. ఎరువుతోపాటు ప్లాస్టిక్‌ వస్తువులు, గాజు సీసాలు, ఇనుమును విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకునే అవకాశం కల్పించారు.

తప్పిన ఆర్థిక భారం..

గతంలో గ్రామాల్లో వివిధ అవసరాల కోసం అద్దె ట్రాక్టర్‌పై ఆధారపడేవారు. పంచాయతీ నిధులు భారీగా ఖర్చు చేసేవారు. ప్రస్తుతం ప్రతి పంచాయతీ ట్రాక్టర్‌ సమకూర్చుకోగా, డబ్బు ఆదా కావడంతో పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మొక్కలకు నీళ్లు పట్టేందుకు, చెత్త తరలింపునకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

గ్రామానికో మణిహారం..

పల్లెలను ఒకప్పుటిలా పచ్చటి చెట్లతో చూడముచ్చటగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పల్లె ప్రకృతి వనాల పేరిట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. కనిష్ఠంగా 20 గుంటలు గరిష్ఠంగా ఎకరంలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. స్థలం విస్తీర్ణాన్ని బట్టి రూ.3.80 లక్షల నుంచి రూ.6లక్షల వరకు నిధులు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల శరవేగంగా సాగుతున్నాయి.


logo