శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 21, 2020 , 02:14:19

ఐసొలేషన్‌ కేంద్రాలను వినియోగించుకోవాలి

ఐసొలేషన్‌ కేంద్రాలను వినియోగించుకోవాలి

మెట్‌పల్లి: కరోనా బాధితులు ఐసొలేషన్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్‌పల్లి ఇన్‌చార్జి ఆర్డీవో వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోరుట్ల, మెట్‌పల్లి సామాజిక దవాఖానలతో పాటు పీహెచ్‌సీల్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మెట్‌పల్లి రూరల్‌(ఇబ్రహీంపట్నం): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కొవిడ్‌-19 పరీక్షలకు వచ్చే వారికి ఇబ్బందులు  తలెత్తకుండా చూడాలని కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాజేశ్‌, ఆర్‌ఐ భూమేశ్‌, వీఆర్వో రవి ఉన్నారు.

కోరుట్ల: పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్‌లో నివసిస్తున్న ప్రజలు కొవిడ్‌ -19 పరీక్షలు చేయించుకోవాలని తహసీల్దార్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల ఇంటి పరిసరాల్లో నివాసముంటున్న ప్రజలు అనుమానం వస్తే పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకోవాలన్నారు. 

కథలాపూర్‌: కరోనా అనుమానితులు కథలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తారన్నారు. 

కోరుట్ల రూరల్‌ : కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోని వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా లక్షణాలున్నవారు ప్రాథిమక దశలోనే పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. 

మెట్‌పల్లి రూరల్‌: జగ్గసాగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 25 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి నరేంద్ర తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన ముగ్గురికి వ్యాధి నిర్ధారణ కాగా క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు.

పెగడపల్ల్లి: మండలంలో గురువారం 8 కరోనా కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి సుధాకర్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో 30 కరోనా పరీక్షలు నిర్వహించగా 8 పాజిటివ్‌, 22 నెగెటివ్‌ వచ్చినట్లు చెప్పారు. బతికపల్లిలో 4, రాంబదృనిపల్లిలో 3, పెగడపల్లిలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.

మల్యాల : మండలంలో ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి లావణ్య గురువారం వెల్లడించారు. 52 టెస్టింగ్‌ కిట్లు కరోనా పరీక్షల నిమిత్తం వినియోగించగా పన్నెండు మందికి పాజిటివ్‌, నలభై మందికి నెగెటివ్‌ వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో మండల కేంద్రానికి చెందిన ఒకరు, బల్వంతపూర్‌లో నలుగురు, లంబాడిపల్లిలో ఇద్దరు ఉన్నారున్నారు. మండల వ్యాప్తంగా ఏడు గురు, ఐదుగురు జగిత్యాల వాసులున్నారని తెలిపారు.


logo