ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 21, 2020 , 02:14:23

పోలీసులకు మెరుగైన చికిత్స

పోలీసులకు మెరుగైన చికిత్స

  • nకరోనా బారిన పడిన వారు ఆందోళన చెందవద్దు
  • nసీపీ కమలాసన్‌రెడ్డి భరోసా

కరీంనగర్‌ క్రైం: కరోనా బారిన పడిన పోలీసులు ఆందోళన చెందవద్దని,  ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో మెరుగైన చికిత్స చేయిస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 18 మంది సిబ్బంది కరోనా బారిన పడిన విషయం విధితమే. కాగా, కమిషనరేట్‌ పరిధిలో బుధవారం నాటికి వైరస్‌ బారిన పడిన పోలీసుల సంఖ్య 104కు చేరింది. ఈ నేపథ్యంలో గురువారం సీపీ కమలాసన్‌రెడ్డి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి, పోలీసులకు ఆత్మైస్థెర్యం చెప్పారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉందని, జాగ్రత్తలు పాటించడంతో వైరస్‌ బారి నుంచి రక్షించుకోవచ్చన్నారు. వైరస్‌ బారిన పడిన పోలీసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అనుమానం ఉన్న పోలీసులు, వారి కుటుంబ సభ్యులు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్థానికంగా మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని, సంతృప్తి చెందిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఇతర ప్రైవేట్‌ దవాఖానలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. కమిషనరేట్‌ పరిధిలో కరోనా బారిన పడిన పోలీసులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ, వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. మిగతా వారిని డ్యూటీల నుంచి తప్పించి హోం ఐసొలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌గా దామోదర్‌రెడ్డి

వన్‌టౌన్‌లో ఇప్పటి వరకు 18 మంది కరోనా బారిన పడడంతో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దామోదర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కమిషనరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన, రిజర్వ్‌లో ఉన్న వివిధ స్థాయిల  అధికారులను తాత్కాలికంగా నియమించి పోలీస్‌స్టేషన్‌ యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.

నిరాడంబరంగా జరుపుకోవాలి

కరోనా నేపథ్యంలో గణేశ్‌ నవరాత్రోత్సవాలు, మొహర్రం నిరాడంబరంగా జరుపుకోవాలని సీపీ కమలాసన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ అశోక్‌, ఇన్‌స్పెక్టర్‌ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేశ్‌, శ్రీనాథ్‌, శ్రీనివాస్‌, పోలీసులు పాల్గొన్నారు. 


logo