గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 19, 2020 , 02:43:54

శిథిలమైన డ్రైనేజీలకు మరమ్మతులు

శిథిలమైన డ్రైనేజీలకు మరమ్మతులు

  •   n ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి 
  •   nమేయర్‌ వై సునీల్‌రావు
  •   n33, 14వ డివిజన్లలో పర్యటన

కార్పొరేషన్‌: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలో కూలిన, శిథిలావస్థకు చేరిన డ్రైనేజీలకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్తవి నిర్మిస్తామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలోని 33, 14వ డివిజన్లలో మంగళవారం ఆయన పర్యటించారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన వరద నీటిని బల్దియా డిజాస్టర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (డీఆర్‌ఎఫ్‌) సిబ్బందిని రప్పించి తొలగించారు. 14వ డివిజన్‌లో డ్రైనేజీలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా నగరపాలక సంస్థ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నీరు నిలిచి ఉంటే దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వరద నీటిని, విరిగిపడిన చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలో శిథిలావస్థకు చేరిన డ్రైనేజీలకు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 14వ డివిజన్‌లో డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో వంద కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో వందల కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయన్నారు. నగరంలో రోజూ తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఎక్కడైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నగరంలో 24 గంటలు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దిండిగాల మహేశ్‌, ఆయా కాలనీల ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo