శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 18, 2020 , 02:59:29

మత్తడి దుంకుతున్న చెరువులు

మత్తడి దుంకుతున్న చెరువులు

  • nఐదు రోజులుగా భారీ వర్షం
  • nచెరువుల్లో నీరు చేరడంపై రైతన్న ఆనందం

కరీంనగర్‌రూరల్‌ : కరీంనగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. ఫకీర్‌పేట, ఎలబోతారం, జూబ్లీనగర్‌, చామనపల్లి అప్పన, రాజసముద్రం చెరువులు, చెర్లభూత్కూర్‌లో పెద్ద, కొత్త చెరువు నిండి మత్తడి దుంకుతున్నాయి. ఐతరాజ్‌ పల్లి -  చెర్లభూత్కూర్‌ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నగునూర్‌ చెక్‌ డ్యాం పూర్తిగా నిండింది. వల్లంపహాడ్‌ వాగు, ఆరెపల్లి, రేకుర్తి, కొత్తపల్లి చెరువులో నీరు చేరింది. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. బొమ్మకల్‌ గ్రామ గుండ్ల చెరువులోకి నీరు రావడంతో పంట పొలాలు విద్యుత్‌ మోటర్లు నీట మునిగాయి. రావి కుంట చెరువు, జక్కని చెరువు, మల్లన్నచెరువు, నల్ల చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి.  మండలంలో సుమారు 256 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అధికారులు తెలిపారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.   ఇదిలా ఉండగా ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య  గ్రామాల్లో సోమవారం పర్యటించారు. కూలిపోయిన ఇళ్లను చూసి బాధితులతో మాట్లాడారు. వివరాలు ప్రభుత్వానికి అందించి ఆదుకుంటామని భరోసానిచ్చారు.  

చెరువులు,కుంటలకు జలకల

 చొప్పదండి : మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. చొప్పదండి కుడిచెరువు, రాముని చెరువు, భూపాలపట్నంలో శివ చెరువు, మంగళపల్లిలో ఈదులకుంట, రావికుంట, మంగళికుంటలు, రేవెల్లిలో మినీట్యాంక్‌బండ్‌, వెదురుగట్ట, చాకుంట, కొలిమికుంట గ్రామాల్లో చెరువులు నీటితో నిండి మత్తడిదుంకుతున్నాయి. వివిధ గ్రామాల్లో సుమారు తొమ్మిది ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. 

ముంచెత్తుతున్న వర్షం

గంగాధర : మండలాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇప్పటికే గట్టుభూత్కూర్‌, ర్యాలపల్లి, సర్వారెడ్డిపల్లి చెరువులు నిండగా, సోమవారం బూరుగుపల్లి ఊర చెరువు సైతం అలుగు పారింది. మత్తడి దుంకుతున్న చెరువులను చూసి స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండలంలో 79.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సాధారణ వర్షపాతం కంటే 32 శాతం అధికంగా కురిసిందని  అధికారులు వివరించారు. భారీ వర్షానికి మండలంలోని గోపాల్‌రావుపల్లిలో ఓ ఇళ్లు కూలి పోయింది. కుటుంబ సభ్యులు మరో గదిలో ఉండడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.


logo