బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 18, 2020 , 02:59:33

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

  • అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
  •  కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ హెల్త్‌: కొవిడ్‌-19 లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్‌ శశాంక కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం ఆయన వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్‌-19 వార్డుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధిని త్వరగా గుర్తించి, మెరుగైన వైద్యం పొందవచ్చని ప్రజలకు సూచించారు. కరోనా  నిర్ధారణ ఆలస్యమైతే ఇతరులకు వ్యాపించడమే కాకుండా వ్యాధి తీవ్రమై, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. సాధారణ జలుబు, జ్వరం, గొంతునొప్పి అనుకుంటూ చుట్టు పక్కల వారు ఏమనుకుంటారో అనే సంకోచంతో ఇంట్లో ఉండవద్దన్నారు. 60 ఏళ్లు దాటిన వారితో పాటు ప్రతి ఒక్కరూ సాధారణ లక్షణాలే అని నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో దగ్గరి సంబంధం ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లు కూడా ఆలస్యం చేయకుండా పరీక్షలు చేసుకోవాలన్నారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, వైద్యాధికారులు పాల్గొన్నారు.


logo