బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 18, 2020 , 02:59:55

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

  • గణేశ్‌ మండపాల ఏర్పాటుకు  అనుమతి లేదు
  •  సీపీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం: గణేశ్‌ నవరాత్రోత్సవాలు, మొహర్రం సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ  సహకరించాలని సీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గణేశ్‌ నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లడించిన విషయాన్ని తెలిపారు. గణేశ్‌ నవరాత్రోత్సవాలతో పాటు మొహర్రం వేడుకలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మండపాలు ఏర్పాటు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన సమూహంతో కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఆలయాల్లో మూడు ఫీట్ల కన్నా ఎత్తు విగ్రహాలు ప్రతిష్ఠించవద్దని కోరారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను ఇండ్లల్లో ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించాలని సూచించారు. విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని, నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. గణేశ్‌ నవరాత్రోత్సవాలు, మొహర్రం సందర్భంగా వివిధ మతాల విశ్వాసాలకు భంగం కల్గించే విధంగా సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. 

సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

కరీంనగర్‌ క్రైం: లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితులను పోలీస్‌ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కమిషనరేట్‌ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారని, వారిని ఇతర మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసులు చేపడుతున్న వరద సహాయక చర్యలు సోమవారం  కొనసాగాయి. పోలీసులు మూడు రోజులుగా వరదతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తుండడంతో పాటు నిలిచిన నీటిని ఎక్స్‌కవేటర్ల సహాయంతో తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు.  వర్షపు నీరు నిలిచి ఉండే పోలీస్‌ స్టేషన్ల ఆవరణ, భవనం పైభాగం, క్వార్టర్లను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. పోలీస్‌ స్టేషన్ల భవనాల పై భాగంలో నిలిచి ఉండే నీటిని తొలగించాలని ఆదేశించారు. 


logo