బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 17, 2020 , 01:40:34

వారం రోజులుగా వాన వదలడం లేదు..

వారం రోజులుగా వాన వదలడం లేదు..

వారం రోజులుగా వాన వదలడం లేదు.. ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అతలాకుతలమవుతున్నది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పోటెత్తుతున్నది. నీటి ప్రవాహం పెరగడంతో పలు గ్రామాల్లోని చెరువులకు గండ్లు, బుంగలు పడ్డాయి. రోడ్ల మీదుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పంటలు నీట మునిగాయి. పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి. ఉన్నతాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనావేశారు.

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండగా, ఆదివారం ఉదయం వరకు 49.5మిల్లీ మీట ర్లు కురిసింది. అత్యధికంగా చిగురుమామిడిలో 80.1, హుజూరాబాద్‌లో 77.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో 36.9 మిల్లీమీటర్లు కురవగా, అత్యధికంగా ముత్తా రం మండలంలో 63.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైం ది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 28.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా తంగళ్లపల్లి మండలంలో 49.0 మిల్లీ మీటర్లు కురిసింది. జగిత్యాల జిల్లాలో 10.55 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  

చెరువులు, కుంటలకు గండ్లు

భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. శంకరపట్నం మండ లం కల్వల వాగు ప్రాజెక్టు కెనాల్‌ తెగింది. దీంతో ఈ వాగులోని చెక్‌డ్యాంలను ముంచుతూ వరద ప్రవహిస్తుండడం తో అవి దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. జమ్మికుంటలో వెంకటేశ్వర నాలమాట్‌ తెగిపోయిం ది. చెల్పూర్‌ చెరువు ఫీడర్‌ చానల్‌ కొట్టుకుపోయింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి చెరువుకు బుంగలు పడ్డాయి. తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లిలోని రాయిని చెరువుకు గండ్లు పడే ప్రమాదం ఏర్పడడంతో ఇసుక బస్తాలు వేసి అరికట్టారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 918 చెరువుల మత్తళ్లు దూకుతున్నాయి. మానేరు, మోయతుమ్మెద, చిలుక వాగు, శంకరపట్నం వాగు, కల్వల వాగులు, ఎల్లమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని 1076 చెరువులు నిండు కుండను తలపిస్తున్నా యి. సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మంథని మండలాల మీదుగా మానేరు నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మంథని మండలం అడవిసోమన్‌పల్లి వంతెన వద్ద మానేరు బ్రిడ్జికి నాలుగు అడుగుల కిందనే ప్రవహిస్తున్నది. మానేరు వరద జలాలతో మంథని మండలం ఆరెం ద, వెంకటాపూర్‌ గ్రామాల్లోని పంట పొలాలు వరదలో కూడుకుపోయాయి. మంథని వద్ద బొక్కలవాగు పరవళ్లు తొక్కుతున్నది. సరస్వతీ బరాజ్‌కు సంబంధించిన 66 గేట్ల ను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో ముత్తారం మండలం మచ్చుపేట వద్ద రసూల్‌కుంటకు గండిపడింది. జూలపల్లి మండలంలో హుస్సేన్‌ మియా వాగు సైతం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని 31 అడుగుల ఎగువమానేరు జలాశయం 23 అడుగులకు చేరింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి  మూలవాగు, తంగళ్లపల్లి మండలంలోని నక్కవాగు పొంగి పొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్‌లేక్‌, కొత్త చెరువులకు వరద పోటెత్తింది. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి పోచమ్మ దేవాలయం నీటిలో మునిగింది. 

అప్రమత్తమైన అధికారులు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌ కలెక్టర్‌ కే శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వరద ప్రవాహం ఉన్న రోడ్లపై రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లిలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లిలో మరో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి పర్యటించి చెరువుల పరిస్థితి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,500 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. చిగురుమామిడి, సైదాపూర్‌, శంకరపట్నం మండలాల్లో డీఏవో వాసిరెడ్డి శ్రీధర్‌ పర్యటించారు. కరీంనగర్‌లోని పలు లోతట్టు ప్రాంతాల్లో మేయర్‌ వై సునీల్‌రావు పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వరదలు ఉధృతంగా ఉండటంలో చిగురుమామిడి మండలం ఇందుర్తి, సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి, మానకొండూర్‌ మండలం వెల్ది, లింగాపూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 


logo