మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 17, 2020 , 01:34:13

నష్టపోయినవారిని ఆదుకుంటాం.. మంత్రి గంగుల

నష్టపోయినవారిని ఆదుకుంటాం.. మంత్రి గంగుల

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ) రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలకు భయపడాల్సిన పని లేదని, ఎంత విపత్తునైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. వరదల వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కలెక్టర్‌, సీపీలతో నిత్యం పరిస్థితిని తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు నిండి మత్తడి దూకుతున్నాయని, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారయంత్రాంగం అంతా గ్రామాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను తెలుసుకొని, తమ దృష్టికి తీసుకువస్తున్నదని చెప్పారు. చాలా చోట్ల భారీ వర్షాలతో పాత ఇండ్లు కూలిపోయాయని, అటువంటి వారిని గుర్తించి, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా లో చాలా చోట్ల పంట నీట మునిగిందని, వరద ప్రవాహం తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వ తుది నివేదిక రాగానే నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. వర్షాలతో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. వీఆర్‌వో స్థాయి నుంచి, తహసీల్దార్‌, పోలీస్‌ సిబ్బంది అంతా గ్రామాల్లో ఉండి పరిస్థితులను తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. కరీంనగర్‌ పట్టణంలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని, మేయర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎప్పటికప్పుడు వరదనీరు తొలగిస్తూ, సహాయక చర్యలు చేపట్టుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని, అధిక వర్షాలు, వరద టలతో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

మానకొండూర్‌: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. వరదనీటితో చెరువులు నిండాయని, గండి పడే అవకాశాలు ఉన్నందునా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌ నుంచి వీణవంక వెళ్తుండగా మంత్రి మానకొండూర్‌ పెద్దచెరువు, ఈదులగట్టెపల్లి చెరువులను సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. ఎక్కడైనా పంటలకు నష్టంవాటిల్లిందా అని అక్కడే ఉన్న తహసీల్దార్‌ రాజయ్య, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 


logo