శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 15, 2020 , 03:42:19

ప్రజల మన్ననలు పొందాలి

ప్రజల మన్ననలు పొందాలి

  • n  పనులు వేగంగా పూర్తి చేయాలి
  • n  రోడ్ల ఆక్రమణలను తొలగించాలి
  • n  మంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌: నగర ప్రజలు టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించారని, వారి మన్ననలు పొందేలా పాలకవర్గ సభ్యులు అభివృద్ధి పనులు చేసి చూపించాలని మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరపాలక సంస్థ  మేయర్‌, కమిషనర్‌, పాలకవర్గ సభ్యులతో అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై ఆక్రమణలు అలాగే ఉన్నాయని, వాటి తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లేబర్‌ అడ్డా రోడ్డుపై చెత్త పేరుకుపోతుందని, వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జ్యోతినగర్‌ ప్రాంతంలోని పార్కు స్థలా ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌ నుంచి స్వశక్తి కళాశాల వరకు ఉన్న రోడ్డు, బస్టాండ్‌ వెనుక ఉన్న రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. నాల్గో తరగతి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడా రోడ్డు ఆక్రమణలు జరుగకుండా చూడాలని స్పష్టం చేశారు. రోడ్లపై కూరగాయల వ్యాపారాలు చేసే వారిని వెంటనే కూరగాయల మార్కెట్లకు తరలించాలన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మినీ కూరగాయల మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు. ప్రజలు కోరుకున్న పనులు చేసినప్పుడే పాలకవర్గానికి గుర్తింపు వస్తుందన్నారు. నగరాభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాత్రం పాలకవర్గంపైనే ఉందని పునరుద్ఘాటించారు. సమావేశంలో మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల  స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

స్నేహితుల ఔదార్యం

సారంగాపూర్‌: జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం కందేనకుంటకు చెందిన బద్ది చిన్న రమేశ్‌ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా, అతడి పదో తరగతి మిత్రులు బాధిత కుటుంబీకులకు ఆర్థికసాయం అందజేశారు. రమేశ్‌ భార్య జల, కుమారుడు జనార్దన్‌ పేరిట రూ.26 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి శుక్రవారం బాండ్‌, రూ.వెయ్యి నగదు అందించారు.  ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులున్నారు.logo