మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 15, 2020 , 03:42:20

ఎరువులకు లేదు కొదువ

ఎరువులకు లేదు కొదువ

  • lరైతులకు అందుబాటులో నిల్వలు
  • lడివిజన్‌లో 40వేల మెట్రిక్‌ టన్నులు  అవసరమని ప్రణాళిక
  • lఇప్పటి వరకు 30వేల ఎంటీల సరఫరా
  • lమిగతా వాటి కోసం ప్రతిపాదనలు

హుజూరాబాద్‌ రూరల్‌: వానకాలంలో హుజూరాబాద్‌ డివిజన్‌లో లక్షా 17వేల ఎకరాలు సాగవుతుండగా, ఈ మేరకు ఆయా పంటలకు కావాల్సిన ఎరువులను ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచింది. పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఆగ్రోస్‌ కేంద్రంతోపాటు ప్రైవేట్‌ దుకాణాల్లోనూ కొరత లేకుండా చూస్తుండడంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

ఈ ఏడాది డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో రైతులు 66వేల ఎకరాల్లో వరి, 36వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో పెసర, కంది, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అన్ని రకాల ఎరువులు కలిపి 40వేల మెట్రిక్‌ టన్నులు అవసరమని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు. సీజన్‌ ప్రారంభానికి ముందే ఏడు వేల మెట్రిక్‌ టన్నుల వరకు సిద్ధం చేశారు. తరువాత విడుతల వారీగా 23వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో పది వేల మెట్రిక్‌ టన్నుల దిగుమతికి ప్రతిపాదనలు పంపారు. 

యూరియానే అధికం..

హుజూరాబాద్‌ డివిజన్‌లో వరి సాగు ఎక్కువగా ఉండ గా, యూరియా వినియోగం అధికంగా ఉంది. ఇందుకోసం 17వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 11వేల ఎంటీల కాంప్లెక్స్‌, ఆరు వేల ఎంటీల డీఏపీ, ఆరు వేల ఎంటీల ఎంవోపీ ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో 14వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, ఎనిమిది వేల ఎంటీల కాంప్లెక్సు ఎరువులు, నాలుగు వేల ఎంటీల డీఏపీ, నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ ఎరువులు ఇప్పటి వరకు సరఫరా అయ్యాయి.

రైతులకు అందుబాటులో విక్రయాలు

రైతుల కోసం పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఆగ్రోస్‌ కేంద్రాల్లో నిల్వలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డివిజన్‌లో అన్ని ఎరువులు కలిపి 2200 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వ్యవవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో హుజూరాబాద్‌లోని పీఏసీఎస్‌లో 60 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌లో 30 ఎంటీలు, జూపాక సింగిల్‌ విండోలో 40, తుమ్మనపల్లిలో సింగిల్‌ విండో 25, గ్రోమోర్‌లో 30, ఫర్టిలైజర్‌ షాపుల్లో వద్ద 120 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ ఉంది. జమ్మికుంట సింగిల్‌ విండోలో 290 ఎంటీలు, తనుగుల పీఏసీఎస్‌లో 90, డీసీఎంఎస్‌లో 80, ఆగ్రోస్‌లో 40, ఫర్టిలైజర్‌ షాపుల్లో వద్ద 200 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. ఇల్లందకుంట పీఏసీఎస్‌లో 120 ఎంటీలు, బోగంపాడు పీఏసీఎస్‌లో 60, డీసీఎంఎస్‌లో 30, ఆగ్రోస్‌లో 30, ఫర్టిలైజర్‌ షాపుల్లో 120 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ ఉంది. వీణవంక మండలం చల్లూర్‌ ఆగ్రోస్‌లో 100 ఎంటీలు, వీణవంక పీఏసీఎస్‌లో 30, చల్లూర్‌ రైతు సంఘంలో 100, ఫర్టిలైజర్‌ షాపుల్లో 180 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. సైదాపూర్‌ మండలంలోని వెన్కేపల్లి సింగిల్‌విండోలో 60 ఎంటీలు, సైదాపూర్‌ సింగిల్‌విండోలో 80, డీసీఎంఎస్‌లో 60, ఫర్టిలైజర్‌ షాపుల్లో 80 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ ఉంది. 


logo