గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:28:38

జోరు వర్షం.. జనం హర్షం..

జోరు వర్షం.. జనం హర్షం..

కోల్‌సిటీ:  అల్పపీడన ప్రభావం కారణంగా వర్షం జోరందుకున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం తడిసి ముద్దయింది. గురువారం ఉదయం నుంచి వర్షంతో జన జీవనం స్తంభించినట్లయింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, స్థానిక పైవింక్లయిన్‌ వంతెన వద్ద వరదనీరు పొంగిపొర్లడంతో మంథని - గోదావరిఖని మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక నగరంలోని దిగువ ప్రాంతా ల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారుమబ్బులు, చల్లని గాలులతో కూడిన వర్షం రోజంతా పడడంతో జనం హర్షం వ్యక్తం చేశారు. 

మంథనిటౌన్‌/ మంథని రూరల్‌/ముత్తారం: మంథని డివిజన్‌లో బుధవారం రాత్రి నుంచి నిరంతరాయంగా జోరుగా వర్షం కురిసింది. గురువారం ఉదయం 8:30 గంటల వరకు డివిజన్‌లో 26.45 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంథనిలో 27.1 ఎంఎం, రామగిరిలో 20.5 ఎంఎం, కమాన్‌ పూర్‌లో 21.4 ఎంఎం, ముత్తారంలో 36.8 ఎంఎంగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముత్తారంలో 36.8 ఎంఎం, అత్యల్పంగా రామగిరి 20.5 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో మంథని-కాటారం ప్రధా న రహదారిపై కురుస్తున్న వర్షానికి భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో కొంత సేపు రాకపోకలు నిలిచి ప్రయా ణికులు, వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును పోలీసులు ఎక్స్‌కవేటర్‌ సాయం తో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌, వర్షపు నీటితో మంథని గోదావరి తీరం నిండు కుండలా దర్శనమిస్తున్నది. వర్షాలతో మం డలంలోని ఆరెంద, మల్లారం, వెంకటాపూర్‌, నాగేపల్లి, స్వర్ణపల్లి, అడవి సోమన్‌పల్లి, గోపాల్‌పూర్‌, చిన్న ఓదాల గ్రామాల గుండా  మానేరు నది నిండుగా ప్రవహిస్తున్నది. దీంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని వాగులు, చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే వరి నాట్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావడం, పత్తి ఎదు గుతున్న క్రమంలో వర్షాలు కురుస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఓదెల: ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్డు లోలెవల్‌ కల్వర్టుల వద్ద వరద నీళ్లుపొంగి ప్రవహిస్తున్నాయి. కొలనూర్‌, మడక, గోపరపల్లిల్లో వరదతో పొలాలు నీట మునిగి ఉన్నాయి. కొందరు రైతులు పొలాల్లోని ఒడ్డులను తెంపి నీటిని బయటికి పంపిస్తున్నారు. మానేరు వాగులో జలకళ సంతరించుకుంది. చెక్‌డ్యాం నుంచి మత్తడి దూ కుతూ వరద నీరు ప్రవహిస్తున్నది. కొలనూర్‌లో రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది.     

పెద్దపల్లి జంక్షన్‌: వర్షంతో పెద్దపల్లిలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీ ఉండే మసీద్‌ చౌరస్తా జనం సంచారం లేక వెలవెలబోయింది. 

కాల్వశ్రీరాంపూర్‌ :  వర్షాలకు చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. కూనారం మర్రి చెరువు, ఊర చెరువు, పెద్దరాత్‌పల్లి ఎల్లారెడ్డి చెరువు, ఇద్లాపూర్‌లో కాముని చెరువు, వెన్నంపల్లిలో పలు చెరువులు, కుంటలు మత్తడి పడుతుండడంతో, చిన్న చిన్న ఒర్రెలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పెద్దరాత్‌పల్లి మట్టలవాగు పరీవాహక ప్రాంతం వెంట ఉన్న పొలాలు నీట మునిగాయి. చెరువులు కుంటలు నిండడంతో వ్యవసాయ పనులు మరింత ఊపందుకున్నాయి.  

సుల్తానాబాద్‌రూరల్‌/ఎలిగేడు: వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరాయి. చిన్నకల్వల హుస్సేన్‌మియా వాగులోకి వరద నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. వాగులో నిండుగా నీళ్లు ప్రవహించాయి. ఎలిగేడు మండలంలోని ఆయా గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. 

పెద్దపల్లి కల్చరల్‌: పెద్దపల్లి పట్టణంలో మళ్లీ ముసురు వాన కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అటు కరోనా వైరస్‌ విస్తరణ.. ఇటు ఎడతెరిపి లేని ముసురు వర్షంతో వార్డుల్లోని ప్రజలెవరూ బయటికి రాలేదు. దీంతో రాత్రి వరకు ప్రజలు లేక నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది.  పెద్దపల్లి శివారులోని ఎల్లమ్మ-గుండమ్మ (మినీ ట్యాంక్‌ బండ్‌) చెరువుతో పాటు బందంపల్లి చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకొని, అటుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. బందంపల్లి చెరువు మత్తడి దూకుతుండడంతో పలువురు యువకులు అక్కడికి చేరుకుని వలలతో చేపలు పట్టారు.

పెద్దపల్లిరూరల్‌: వర్షాలతో పెద్దపల్లిలో వాగులు, వంక లు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. పొలాలు వరద నీటిలో మునిగి పోయాయి. పెద్దపల్లి మండలంలో గరిష్టంగా29.2 మిల్లీమీటర్లు, కనిష్టంగా9.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి మండలంలోని ముత్తారం, గౌరెడ్డిపేట, గుర్రాంపల్లి, మారేడుగొండ, వెన్నంపల్లి గుట్టల నుంచి వచ్చే వరద నీరు వచ్చి పొలాలన్నీ మునిగిపోయాయి. ముదిరాజ్‌ కులస్థులతో పాటు పలు ప్రాంతాల్లో యువకులు చేపలు పట్టుకుంటూ సంతోషంగా గడిపారు. 


logo