ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:17:43

వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

 వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

 చొప్పదండి: కరోనా నేపథ్యంలో సుమారు ఐదు నెలలుగా వ్యాపారాలు  నడవక వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు పెట్టుబడికి దాచి ఉంచిన డబ్బులను ఇంటి అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం వ్యాపారం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా రూ.10 వేల చొప్పున రుణం ఇస్తున్నది. 

 466 మంది వ్యాపారుల గుర్తింపు

చొప్పదండి పట్టణంలో 466 మంది వీధి వ్యాపారులను అధికారులు గుర్తించారు. మెప్మా ఆర్పీలు వీధి వ్యాపారుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 300 మందికి గుర్తింపు కార్డులు సైతం ఇచ్చారు. ఇప్పటి వరకు 255 మందికి రుణం మంజూరుకు బ్యాంకులకు సిఫారసు చేశారు.  కాగా, 137 మందికి రూ. 10 వేల చొప్పున బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. 

 మెప్మా ఆర్పీల సర్వే

 పట్టణంలో వీధి వ్యాపారులను గుర్తించేందుకు మెప్మా ఆర్పీలు సర్వే చేస్తున్నారు.  ఐకేపీ సిబ్బంది వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో నమోదైన వివరాల ప్రకారం రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే, వారి వివరాలను పరిశీలించి బ్యాంకు ఖాతా ఆధారంగా అందజేస్తున్నారు. పట్టణంలో ఇప్పటి వరకు 466 మందిని గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితమే పట్టణంలో ప్రతి వీధి వ్యాపారి వివరాలు సేకరించి ప్రతి ఒక్కరికీ ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద రుణం పొందేలా చూడాలని జిల్లా మెప్మా పీడీ రవీందర్‌ ఆదేశించడంతో ఆర్పీలు పట్టణంలోని వీధి వ్యాపారుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో  నమోదు చేశారు.

 డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన

 మెప్మా ఆర్పీలు వీధి వ్యాపారులకు డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వ్యాపారులు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, తదితర యాప్‌ల ద్వారా సులభంగా లావాదేవీలు ఏవిధంగా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు. 

రుణాలు సక్రమంగా చెల్లిస్తే..

ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా పట్టణంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో 137 మందికి రూ.10 వేల చొప్పున రుణాలు బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఈ రుణాలను అతి తక్కువ వడ్డీతో 12 నెలల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. వడ్డీ 11 శాతం ఉండగా.. ప్రతి నెలా సక్రమంగా వాయిదా చెల్లిస్తే 7శాతం వడ్డీ తగ్గింపు ఉండగా.. కేవలం 4 శాతం మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది.


logo