ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:17:42

ఎడతెగని ముసురు..

ఎడతెగని ముసురు..

ముసరందుకున్నది.. ఐదు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాను తడుపుతున్నది.. ఎడతెరిపిలేకుండా పడుతూ, అప్పడప్పుడూ గెరివిస్తున్నది.. అక్కడక్కడా దంచి కొడుతున్నది.. గురువారం అయితే పొద్దటి నుంచి ఏకధాటిగా  కురుస్తుండగా, ప్రజానీకం ఇండ్లకే పరిమితమైంది.. వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వాగులూ వంకలు ఉప్పొంగాయి.. చెరువులూ కుంటలు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి.. భారీగా చేరుతున్న వర్షపు నీటితో జలాశయాలూ కళకళలాడుతున్నాయి.. ఇటు ఇప్పటికే వేసిన పంటలు జీవం పోసుకోగా, రైతుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.. ఊరూరా సాగు పనులు జోరుగా సాగుతుండగా,     ఈ యేడు కాళేశ్వరం నీళ్లకు తోడు సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పంటలకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

కరీంనగర్‌ జిల్లాలో 29.0 మిల్లీమీటర్లు..

జిల్లా మొత్తంగా సగటున 29.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుజూరాబాద్‌, చొప్పదండి మండలాల్లో 38.5 మిల్లీ మీటర్ల చొప్పున నమోదు కాగా, అత్యల్పంగా కొత్తపల్లి మండలంలో 18.4 మిల్లీమీటర్లు రికార్డయింది. హుజూరాబాద్‌ డివిజన్‌లో భారీ వర్షాలు పడుతుండగా, 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డివిజన్‌లో మొత్తం 436 చెరువులు, కుంటలు ఉంటే 182 మత్తళ్లు దుంకుతున్నాయి. వీణవంక, జమ్మికుంట మండలాల పరిధిలోని మానేరు వాగుతోపాటు హుజూరాబాద్‌లోని చిలుక వాగు, వీణవంక, శంకరపట్నం మండలాల పరిధిలోని కల్వల వాగు, కేశపట్నం వాగులు పొంగుతున్నాయి. సైదాపూర్‌ మండలంలోని సోమేశ్వరం చెరువు మత్తడి దూకుతుండగా, కొద్ది సేపు రాకపోకలు నిలిచాయి. కరీంనగర్‌ డివిజన్‌లో 27.5 మి.మీ వర్షపాతం రికార్డు కాగా, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ మండలాల పరిధిలో ఉన్న మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతున్నది. వాగు పరిసర ప్రాంతాల నుంచి 1,569 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఇటు చొప్పదండి మండలం రాగంపేట, ఆర్నకొండ గ్రామాల పరిధిలో ఉన్న పంది వాగు, రామగుడు మండలంలోని మోతె వాగులు పారుతున్నాయి. డివిజన్‌లో 931 చెరువులు, కుంటలు ఉండగా 46 చెరువులు మత్తళ్లు దునుకుతున్నాయి. మొత్తంగా చూస్తే కరీంనగర్‌ డివిజన్‌లో 27.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 1,376 చెరువులు, కుంటలు ఉండగా, మెజార్టీ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మంగళవారం వరకు 228 మత్తళ్లు దుంకాయి.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27.1 మిల్లీమీటర్లు.. 

జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాతం 11.4 మి.మీ. కాగా, 27.1 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యధికంగా సిరిసిల్ల అర్బన్‌ మండలంలో 44మి.మీ., అత్యల్పంగా చందుర్తి మండలంలో 8.5మి.మీ. రికార్డయింది. ఎడతెరిపిలేని వానలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. మెదక్‌ జిల్లా కూడెల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు పొంగిపొర్లుతూ ఎగువ మానేరులోకి దూకుతున్నాయి. ఈ రెండింటి ప్రవాహంతో నర్మాల ఎగువమానేరు జలాశయంలో 13అడుగులకు నీరు చేరింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని నక్కవాగు ప్రాజెక్ట్‌ జలకళను సంతరించుకుని, మత్తడి దూకుతున్నది. ఇటు వేములవాడలోని మూలవాగు వరద నీటితో ప్రవహిస్తున్నది. 

పెద్దపల్లిలో జిల్లాలో 27.8 మిల్లీమీటర్లు..

జిల్లాలో సరాసరిగా 27.7 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా జూలపల్లి మండలంలో 41.9 మి.మీ., అత్యల్పంగా పాలకుర్తి మండలంలో 16.3 మి.మీ. నమోదైంది. మొత్తం 1076 చెరువులుండగా, అందులో 75శాతానికి పైగా చెరువులు నిండాయి. హుస్సేన్‌మియా వాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నా చితకా వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇవన్నీ గోదావరిలో కలుస్తుండడంతో నది నిండుగా ప్రవహిస్తున్నది. గోదావరిఖనిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జగిత్యాల జిల్లాలో 29.13 మిల్లీమీటర్లు..

జిల్లాలో సరాసరిగా 29.13 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా పెగడపల్లిలో 44.2మి.మీ., అత్యల్పంగా కొడిమ్యాలలో 10మి.మీ. పడింది. ధరూర్‌ చెక్‌డ్యాం దూకింది. మోతె చెరువు, ముప్పారపు చెరువు, పొలాస చెరువు, అనంతారం చెరువులు నిండాయి. జిల్లాకేంద్రం శివారులోని కండ్లపెల్లి చెరువు అలుగు పారింది. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయి.


logo