ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 14, 2020 , 03:17:41

వరదకాలువకు నాలుగు తూములు

వరదకాలువకు నాలుగు తూములు

మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా వరదకాలువకు నాలుగు తూములు నిర్మించే ప్రక్రియ వేగవంతమైంది. అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా తూముల నిర్మాణాలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అంతే కాదు, పనులుయుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించగా, ముంపు లేకుండా చొప్పదండి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. ముఖ్యమంత్రి దూర దృష్టికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొనగా, దశాబ్దాలుగా పడుతున్నఈ ప్రాంత రైతుల కష్టాలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. 

రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు గతంలో రామడుగు మండలంలో మోతె రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దీని వల్ల మూడు నాలుగు గ్రామాలు ముంపునకు గురికావడమే కాకుండా, రిజర్వాయర్‌ కోసం వేలాది ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉండేది. అంతేకాకుండా సుమారు ఆరేడు వందల కోట్లు నిర్మాణానికి అవసరమయ్యేవి. రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల తాము నిర్వాసితులం అవుతామని చాలా గ్రామాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాలువను ఇప్పటికే జీవ నదిలా మార్చిన సంగతి తెలిసిందే. గోదావరి ఎత్తిపోతల పథకం కింద ఒక టీఎంసీ నీటిని వదరకాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ వరకు తీసుకెళ్లేందుకు పంప్‌హౌస్‌లను పూర్తి చేశారు. ఈ పరిస్థితుల్లో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న వరదకాలువను మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించి.. సాగునీరందించి ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చాలని సీఎం గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఇతర అధికారులు కలిసి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. వాటిని ముఖ్యమంత్రి పరిశీలించి.. పలు మార్పులు చేర్పులు చేయించి గతంలోనే వాటికి ఆమోద ముద్ర వేశారు. 

ముంపు లేకుండా 30వేల ఎకరాలకు నీళ్లు..

నిజానికి మోతె రిజర్వాయర్‌కు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తే దాని ద్వారా సాగయ్యేది ఓ పది పదిహేను వేల ఎకరాలు మాత్రమే. కానీ, ప్రస్తుతం ప్రత్యామ్నాయం వల్ల 30వేల ఎకరాలకు నీరందుతుంది. అది కూడా ఎటువంటి ముంపు లేకుండా! అందుకోసం.. ముఖ్యమంత్రి అనుసరించిన వ్యూహాత్మక పద్ధతి, అలాగే సాగునీటి రంగంపై ఉన్న అపార అనుభవం, పకడ్బందీ ప్రణాళిక వంటి విషయాలు దోహద పడ్డాయి. వరదకాలువ నీటిని వినియోగించి ఈ నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లోని రైతులకు శాశ్వతంగా సాగునీరందించే ప్రక్రియను చేపట్టారు. అందుకోసం నియోజకవర్గంలోని శ్రీరాంలపల్లె, కొండన్నపల్లె, షానగర్‌, తాడిజెర్రి నాలుగు ప్రాంతాల్లో వరదకాలువకు తూములు పెట్టాలని నిర్ణయించారు. వీటికి గతంలోనే టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఆ టెండర్లు ఒకే అయ్యాయి. అంతేకాదు, ఈ పనులను చేపట్టేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. యుద్ధప్రాతిపదికన ఓటీ పనులను చేపట్టి.. సంబంధిత రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. 

180 కోట్లతో నాలుగు తూములు : ఎమ్మెల్యే 

మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా వరదకాలువపై నాలుగు ప్రాంతాల్లో తూములు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తెలిపారు. ఇది సంతోష కరమైన విషయమన్నారు. తన విజ్ఞప్తులకు సానూకూలంగా స్పందించారని, ఇది నియోజకవర్గ రైతులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ఎక్కడా ఇంచు భూమి, ఒక్క ఇల్లు ముంపునకు గురికాకుండా చూడడమే కాదు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ముఖ్యమంత్రి ప్లాన్‌ చేసిన తీరు.. ఆయనకు సాగునీటి రంగంపై ఉన్న పట్టును తెలుపుతుందన్నారు. యావత్‌ నియోజకవర్గం ఈ విషయంలో ముఖ్యమంత్రికి రుణపడి ఉటుందన్నారు. వరదకాలువ జీవనదిలా ఉంటుందని, దీనిద్వారా తమ నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లో సాగు విస్తీర్ణం పెరగడమేకాదు.. ప్రస్తుతం చేపట్టనున్న తూములు, వాటి కాలువల ద్వారా భూగర్భజలాలు భారీగా పెరుగుతాయన్నారు. గతంలో ఎప్పుడు చూసిన చొప్పదండి నియోజకవర్గం కరవు ప్రాంతంగానే ఉండేదని, ముఖ్యమంత్రి దూర దృష్టి వల్ల ఇక ముందు శాశ్వతంగా కమాండ్‌ ఏరియగా మారుతుందన్నారు. ఈ విషయంలో సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. 


logo