ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 13, 2020 , 01:54:09

మంత్రి ఈటలపై విమర్శలు సహించం

మంత్రి ఈటలపై విమర్శలు సహించం

  n వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూడడం బాధాకరం

 n ఓర్వలేకే కాంగ్రెస్‌, బీజేపీ నేతల    ఆరోపణలు

nటీఆర్‌ఎస్‌ నాయకుల ధ్వజం 

హుజూరాబాద్‌టౌన్‌: ‘నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే మంత్రి ఈటల రాజేందర్‌పై కొందరు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు.., అనవసర ఆరోపణలతో వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నరు..’ అంటూ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, రాష్ట్ర నేత తుమ్మేటి సమ్మిరెడ్డి ఆక్షేపించారు. హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ దవాఖానను 100 పడకలకు పెంచి సకల సౌకర్యాలు కల్పించిన ఘనత మంత్రి ఈటలకే దక్కిందన్నారు. ఇక్కడికి చికిత్స కోసం అనేక మంది వస్తున్నారని చెప్పారు. కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నాయకులు అబండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న ఈటలపై కాంగ్రెస్‌ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలంగాణలో కొవిడ్‌-19 రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశంసిస్తుంటే, కావాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్కారు దవాఖానలో అన్ని వసతులు కల్పించడంతో హుజూరాబాద్‌, జమ్మికుంటలోని ప్రైవేట్‌ దవాఖానలు మూత పడే స్థితికి వచ్చాయని, దిక్కుతోచకనే వారికి వత్తాసు పలకడానికి ప్రభుత్వ వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఏ ఒక్క కేసును ఇతర దవాఖానలకు రెఫర్‌ చేయకుండా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అనవసర ఆరోపణలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షుడు పింగిలి రమేశ్‌ మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయాలనే అర్హత కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మంత్రి ఈటల రాజేందర్‌ సోదరుడు ఈటల భద్రయ్య, జమ్మికుంట జడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరాం శ్యామ్‌, హుజూరాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ కన్నెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణ శాఖల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్‌, టంగుటూరి రాజ్‌కుమార్‌, మండల అధ్యక్షుడు గోపు కొంరారెడ్డి, నాయకులు గందె శ్రీనివాస్‌, ఇరుమల్ల సురేందర్‌రెడ్డి, దేశిని కోటి, శీలం శ్రీనివాస్‌, రాపర్తి శివ, తాళ్లపల్లి చిన్న రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.logo