శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 13, 2020 , 01:54:27

మరింత లోతుగా విచారణ

మరింత లోతుగా విచారణ

  •  ‘బొమ్మకల్‌ భూదందా’పై బిగుస్తున్న ఉచ్చు
  •  గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ..  జడ్పీ కార్యాలయానికి తరలింపు
  •  తాజాగా  నలుగురు అనుచరుల అరెస్ట్‌

కరీంనగర్‌ క్రైం/కరీంనగర్‌ రూరల్‌: బొమ్మకల్‌ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలపై విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఆర్డీవో ఆధ్వర్యంలో వారం నుంచి సర్వే నడుస్తున్నది. ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ గడ్డం సుధాకర్‌, సర్వేయర్‌తో కలిసి బుధవారం ప్రభుత్వ భూములను సర్వే చేశారు. సాయంత్రం ఆక్రమిత ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 28లో హద్దులు ఏర్పాటు చేసి, హెచ్చరిక బోర్డులు పెట్టారు. కబ్జాదారులను గుర్తిం చి, వివరాలు సేకరించారు. ఆక్రమించిన సంబంధిత యాజమాన్యాలు, సంస్థలపైన కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్‌ కమిటీ సభ్యులు ఎంపీవో జగన్‌మోహన్‌ రెడ్డి పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. 2001నుంచి ఇప్పటి 2020 వరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణ పర్మిషన్లు, గ్రామ పంచాయతీ బిల్లులు, ఇంటి నంబర్లు, డిమాండ్‌ రిజిస్టర్లు, లే అవుట్ల పర్మిషన్లు, అప్రూవల్‌ ఫైల్స్‌ పంచాయతీ బ్యాంకు ఖాతా, బ్యాంకు చెల్లింపుల చలాన్లు, ట్రైజరీ రికార్డులు, ఎంబీ పుస్తకాలు, వివిధ రికార్డులను పరిశీలించా రు. అనంతరం జడ్పీ కార్యాలయానికి తరలించారు. ఇంకోవైపు పోలీసులు విచారణ జరుపుతున్నారు. పురుమల్ల శ్రీనివాస్‌ ఒత్తిడి వల్ల గతంలో 22ఇండ్ల నిర్మాణాలకు అనుమతించినట్లు అప్పటి గ్రామ కార్యదర్శులు మల్లయ్య, శ్రీధర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం మీద గ్రామ పంచాయ తీ, ప్రభుత్వ భూములు భూదందాలకు సంబంధించిన కీలకమైన సమాచారం బయటకు వస్తుండడంతో మరింత లోతుగా అన్వేషిస్తున్నారు.  

నలుగురు శ్రీనివాస్‌ అనుచరుల అరెస్ట్‌

బొమ్మకల్‌ భూ వివాదంలో సర్పంచ్‌ పురుమ ల్ల శ్రీనివాస్‌ ఇదివరకే అరెస్ట్‌ కాగా, ఆయన అను చరులను తాజాగా అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ తో కలిసి భూములు కబ్జా చేసిన ఆయన అనుచరులు ఎరువ జోజిరెడ్డి, వరాల శ్రీనివాస్‌, మాచర్ల సత్య నారాయణ, బాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించండి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న గ్రామాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ సీఎం కేసీఆర్‌ను కోరింది. బొమ్మకల్‌లో 180, ఆరెపల్లిలో 104, తీగలగుట్టపల్లిలో 230, రేకుర్తిలో 270, మల్కాపూర్‌లో 200, లక్ష్మీపూర్‌లో 70, సీతారాంపూర్‌లో 50, చింతకుంట లో 800 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయ ని, కానీ వాస్తవంగా పరిశీలిస్తే ఇందులో 10శాతం కూడా కనిపించడం లేదని లోక్‌సత్తా పేర్కొంది. తీగలగుట్టపల్లిలోని అపోలో దవాఖాన సమీపంలో సర్వే నంబర్‌ 120లో దాదాపు 100 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందిందని, గంగాధర మండలం కురిక్యాలలో సర్వే నంబర్‌ 62లోని చెరువు శిఖం భూమి 16 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా నాయకులు ఎన్‌ శ్రీనివాస్‌, ప్రకాశ్‌ హోల్లా, ఆర్‌ చంద్రప్రభాకర్‌, కేఎస్‌ నారాయణ, ఎం గంగాధర్‌, ముజఫర్‌, మనోహర్‌, టీ గంగారావు సీఎంకు విజ్ఞప్తి చేశారు.


logo