గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 11, 2020 , 00:33:52

వరప్రదాయని వరద కాలువ

వరప్రదాయని వరద కాలువ

గంగాధర: మెట్ట ప్రాంతమైన గంగాధర మండల రైతులకు వరద కాలువ వరప్రదాయనిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్‌ గాయత్రీ పంపుహౌస్‌ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో ఏడాది కాలంగా జీవనదిని తలపిస్తున్నది. వరద కాలువకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతుండడంతో పాటు బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు సాగులోకి వచ్చాయి. వరద కాలువను జీవనదిలా మార్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

సాగనీరు అందించడమే లక్ష్యం

మెట్ట ప్రాంతమైన గంగాధర మండలంలో 13 గ్రామాలను తాకుతూ వరద కాలువ వెళ్తుంది. ఇన్ని గ్రామాల గుండా వరద కాలువ వెళ్తున్నా రైతులు వేసిన పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో నిర్మాణం జరిగినా పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వరద కాలువకు నీటిని విడుదల చేయలేదు. దీంతో వరద కాలువ పరీవాహక ప్రాంతంలోని రైతులు వేసిన పంటలకు సాగు నీరు అందని పరిస్థితి. దీంతో ఏడాదికేడాది సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. తూముల ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది.

చెరువులకు జలకళ

లక్ష్మీపూర్‌ గాయత్రీ పంపుహౌస్‌ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆయా గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసిన తూముల ద్వారా చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఏడాది పొడవునా వరద కాలువ నీటి ప్రవాహంతో జీవనదిని తలపిస్తున్నది. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఏడాదికి రెండు పంటలకు సాగు నీరందుతున్నది. చెరువులు నిండడంతో పంటలు బాగా పండి తమ జీవితాలు బాగుపడుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాలు హేళన చేశాయి

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే వరద కాలువ జీవనదిలా మారుతుందని మాట్లాడితే ప్రతిపక్షాలు హేళన చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువ నీరు లేక ఎడారిలా కనిపించేంది. గాయత్రీ పంపుహౌస్‌ ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో వేలాది ఎకరాలకు సాగు నీరు అంది పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉంటున్నారు. -సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్యే

నెరవేరిన రైతుల కల

బూరుగుపల్లి  వద్ద వరద కాలువకు ప్రభుత్వం తూము ఏర్పాటు చేయడంతో సాగు నీటి కష్టాలు తీరినైట్లెంది. మా ఊర చెరువులోకి నీరు చేరి నిండుకుండలా మారింది. దీంతో ఏళ్లనాటి  రైతుల కల నెరవేరింది. చెరువు పూర్తిగా నిండితే  భూగర్భ జలాలు పెరిగి వెయ్యి ఎకరాలకు సాగు నీరు అందుతుంది.- సత్యనారాయణరావు, రైతు, బూరుగుపల్లి

బీడు భూములు సాగులోకి  

వరద కాలువ జీవనదిలా మారడంతో గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు సాగులోకి వచ్చాయి. గతంలో వానకాలం పంటకు మాత్రమే సాగు నీరు అందేది. యాసంగి నీరందడం కష్టంగా ఉండేది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కారు వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో రెండు పంటలకు నీరు అందుతున్నది.          -సుంకె అనిల్‌, రైతు,లక్ష్మిదేవిపల్లి

తీరిన సాగు నీటి కష్టాలు

వరద కాలువలో ఏడాది పొడవునా నీరు పారుతుండడంతో సాగు నీటి కష్టాలు తీరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాకముందు వరద కాలువ ఎడారిగా కనిపించేది. తెలంగాణ సర్కారు వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో సాగు నీటి కష్టాలు తీరాయి. దీంతో రెండు పంటలు సాగు చేసుకుంటున్నాం.-నిమ్మనవేణి ప్రభాకర్‌, రైతు, కొండన్నపల్లితాజావార్తలు


logo