ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 11, 2020 , 00:20:15

విస్తారంగా వర్షాలు

 విస్తారంగా వర్షాలు

చినుకూ చినుకూ కలిసింది.. చిటపటవానై కురిసింది.. ముసురులా మొదలై, జడివానై ముంచెత్తింది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అక్కడక్కడా ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. వరద పోటెత్తి, వాగులూ వంకలు ఉప్పొంగాయి. చెరువులూ కుంటలు మత్తళ్లు దుంకగా, జలపాతాలూ జాలువారాయి. పంటచేలూ జీవం పోసుకోగా, అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను ముసురు పట్టేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు కొన్ని చోట్ల విస్తారంగా వర్షం పడుతుండడంతో చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే కాళేశ్వరం జలాలతో నిండిన చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పారుతున్నాయి. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలో 117.6 మిల్లీ మీటర్ల వర్షం కురువగా, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కరీంనగర్‌ జిల్లాలో 64.7 మిల్లీమీటర్లు

కరీంనగర్‌ జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటల వరకు సగటు వర్షపాతం 64.7 మిల్లీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా హుజూరాబాద్‌లో 117.6, అత్యల్పంగా చొప్పదండిలో 16.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మానేరు, మోయతుమ్మెద, చిలుక వాగు, కల్వల ప్రాజెక్టు వాగుల్లో వరద పారుతోంది. సైదాపూర్‌ మండలం రాయికల్‌ జలపాతం కనువిందు చేస్తోంది. జిల్లాలో మొత్తం 125 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,376 చెరువులు ఉండగా 426 చెరువుల్లోకి 25 శాతం, 280 చెరువుల్లోకి 25-50 శాతం, 347 చెరువుల్లోకి 50-75 శాతం, 198 చెరువుల్లోకి 75-100 శాతం నీరు వచ్చినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

జగిత్యాలలో 23.69 మిల్లీమీటర్లు

జిల్లా వ్యాప్తంగా 23.69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెట్‌పల్లిలో 34.0, అత్యల్పంగా వెల్గటూర్‌లో 8.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 832 చెరువులు ఉండగా, 52 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 160 చెరువుల్లోకి 75 శాతం, 350 చెరువుల్లోకి 50 శాతం నీరు చేరింది. మిగిలిన 270 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరున్నది. 

పెద్దపల్లిలో 28.9 మిల్లీ మీటర్లు

జిల్లా వ్యాప్తంగా 28.9మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముత్తా రం మండలంలో అత్యధికంగా 50.4 మిల్లీ మీటర్లుకాగా, అత్యల్పంగా పాలకుర్తి మండలంలో 5.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

రాజన్న సిరిసిల్లలో 69.2 మిల్లీమీటర్లు 

జిల్లా వ్యాప్తంగా 69.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చందుర్తిలో అత్యధికంగా 82.6 కాగా, అత్యల్పంగా ముస్తాబాద్‌ లో 48.2 మిల్లీమీర్ల వర్షపాతం నమోదైంది.logo