మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 10, 2020 , 01:37:52

బొమ్మకల్‌ భూదందాలపై విచారణ

బొమ్మకల్‌ భూదందాలపై విచారణ

కరీంనగర్‌రూరల్‌: బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో భూదందాలపై కలెక్టర్‌ శశాంక ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ కమిటీ ఆదివారం విచారణ చేసింది. గ్రామంలోని ప్రభుత్వ భూములు, గోపాల్‌పూర్‌ చెరువు ప్రాంతంలోని సమ్మక్క గద్దెల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఓల్డేజ్‌ హోంకు కేటాయించిన స్థలం, ప్లాంటేషన్‌ స్థలాలు చూశారు. గోధుమ కుంటలోని సర్వేనంబర్‌ 250లో భూములను సర్వేయర్‌తో కొలతలు వేయించారు. జక్కనికుంట, మల్లన్నకుంట, గోపాల్‌ చెరువు పరిధిలో పూర్తి స్థాయిలో భూములు సర్వే చేయించి, ప్రభుత్వానికి చెందిన వాటికి కంచె ఏర్పాటు చేయాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు. 782 సర్వేనంబర్‌లో ఉన్న విగ్రహాలు, దేవాలయాలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి రెండు గుంటలు తప్ప, ఎవరికీ స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండా ప్రహరీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతి వనానికి స్థలం కేటాయించి మొక్కలు పెంచి, స్థలం ఆక్రమణకు గురవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల రికార్డులను వారం రోజుల్లో కలెక్టర్‌కు అందజేయాలని, అందుకు అవసరమైతే మరో ఇద్దరు వీఆర్వోలు, ఆర్‌ఐలను సర్వేకు వినియోగించుకోవాలని తహసీల్దార్‌ సుధాకర్‌కు సూచించారు. 


logo