శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 10, 2020 , 01:37:49

ఆ అధికారి లీలలు ఇన్నిన్నీ కావయా?

ఆ అధికారి లీలలు ఇన్నిన్నీ కావయా?

 (కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రెవెన్యూ విభాగంలోని ఓ అధికారి కలెక్టరేట్‌ ఏవోగా పనిచేసిన కాలంలో అడుగడుగునా తన మాయాజాలాన్ని ప్రదర్శించారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను ఒంటబట్టించుకున్న ఆయన, వాటిని వాడుకొని.. అనుకున్న కార్యకలాపాలను నడిపించారు. అడ్‌హక్‌ ఉద్యోగోన్న తుల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించారు. వీఆర్వో, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చక్రంతిప్పారు. ఇదంతా చేయడానికి దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన ఓ కలెక్టర్‌ను పూర్తిగా పక్కదారి పట్టించారు. సదరు కలెక్టర్‌ వద్ద పనిచేసే ఒక సీసీ ద్వారా ఈ వ్యవహారం నడిపారని విశ్వసనీయ సమాచారం. 

పట్టించుకోని టీఎన్‌జీవో ఫిర్యాదు 

పదోన్నతుల తతంగమంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఎన్‌జీవో సంఘం అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే.. సదరు ఫిర్యాదుపై ఎటువంటి విచారణ జరగనివ్వకుండానే మూసివేయించడంలో ఆ అధికారి ప్రముఖ పాత్రపోషించారు.

మాయాజాలం 

గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా నీతూ ప్రసాద్‌ పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కారుణ్య నియామకాల కోసం పలువురు రెవెన్యూ ఉద్యోగులు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ సర్టిఫికెట్లను సమర్పించారు. వాటిని నిబంధనల ప్రకారం వెరిఫికేషన్‌ చేయించిన కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌.. సుమారు 30 మందికి పైగా ఉద్యోగుల మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ సర్టిఫికెట్లను నిలిపేశారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని భావించి ఆ ఫైలును తొక్కిపెట్టారు. ఆ తదుపరి అవి పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. ఆమె వెళ్లిన తదుపరి చాలా మంది ఏవోలుగా పనిచేసినా, వారెవ్వరూ సదరు ఫైల్‌ను ముట్టుకోలేదు. కానీ, ఈ అధికారి ఏవో కాగానే వాటిని ముందేసుకుని వ్యవహారం మొదలు పెట్టారు. ఇందుకోసం గతంలో పనిచేసిన ఒక కలెక్టర్‌నే పక్కదారి పట్టించారు. ఆ కలెక్టర్‌ వద్ద పనిచేసిన ఒక సీసీ ద్వారా ఈ వ్యవహారమంతా నడిపినట్లు సమాచారం. నీతూ ప్రసాద్‌ నిలిపేసిన సదరు ఉద్యోగులంతా మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌కు అర్హత ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు ద్వారా సర్టిఫై చేయించి ఉద్యోగాలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే.. నిలిపేసిన అన్నింటినీ ఓకే చేయించడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని రెవెన్యూలో శాఖలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే.. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ తీసుకున్న వారిలో మెజార్టీ శాతం చాలా ఆరోగ్యంగా ఉన్నారని రెవెన్యూ సిబ్బందే చెబుతున్నారు. అయితే, ఈ  వ్యవహారంపై విచారణ జరిపితే జరిగిన తతంగమంతా పూర్తిస్థాయిలో బహిర్గతం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ ఎందుకు నిలుపు చేశారు? సదరు వ్యక్తుల ఫైళ్లలో ఏమి రాశారు..? అందులో ఉన్న అంశాలు? ఆ తదుపరి మారిన పరిస్థితులు ఏమిటి?.. నిలిపేసిన అన్నింటినీ ఈ అధికారి ఏవోగా పనిచేసిన కాలంలోనే ఎందుకు ఓకే చేశారు..? అందులో నిజంగా అర్హత ఉన్న వారు ఎంత మంది? దీని వెనుక జరిగిన తతంగం ఏమిటి? అనే విషయాలపై లోతుగా విచారణ చేస్తే వ్యవహారమంతా బయటకు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ నుంచి లీకులు 

కలెక్టరేట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి ఆ విభాగంలో జరిగే ప్రతీ విషయాన్ని ఈ అధికారికి లీక్‌ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. సదరు అధికారికి తెలువకుండా ఈ విభాగంలో ఒక్క ఫైల్‌ ముందుకు కదలడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. లీకులు ఇచ్చే అధికారికి ఉద్యోగోన్నతి వచ్చినా.. తిరిగి అదే విభాగంలో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటేషన్‌పై ఇదే విభాగంలో కొనసాగడంపై ఎన్నో అనుమానాలున్నాయి. ఈ వ్యవహారంతో రెవెన్యూ ఉద్యోగులు విసిగి వేసారుతున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. తమను ఎక్కడ.. ఎందులో ఇరికిస్తారోనన్న భయం వారిలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేస్తే ముందుగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ నుంచి లీకులు ఇస్తున్న అధికారిని పక్కన పెడితే జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని రెవెన్యూ ఉద్యోగులే పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివిధ హోదాల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయంలో ఈ విభాగంలో పనిచేసిన అధికారి హస్తం ఉన్నట్లుగా సమాచారం.

వేతనం ఇక్కడ.. పని అక్కడ 

కలెక్టరేట్‌లో పార్కు నిర్వహణ, ఇతర వాటికోసం.. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కొంత మందిని తీసుకున్నారు. నిజానికి సదరు సిబ్బంది కలెక్టరేట్‌ పరిధిలో పని చేయాలి. కానీ.. ఒకరు మాత్రం కలెక్టరేట్‌ నుంచి వేతనం పొందుతూ.. సదరు అధికారి వద్ద పనిచేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రస్తుతం సదరు అధికారి కలెక్టరేట్‌లో పనిచేయడం లేదు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ఓ మండలంలో తహసీల్దార్‌గా పనిచేస్తుండగా, ఆ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కూడా సదరు అధికారి వద్ద పనిచేస్తుండడం గమనార్హం. కలెక్టరేట్‌ నుంచి వేతనం పొందుతున్న ఆ ఉద్యోగిని ఎవరి అనుమతి లేకుండానే సదరు అధికారి తాను పనిచేసే చోటికి తీసుకెళ్లారంటే అతని వ్యవహార శైలిని అర్థంచేసుకోవచ్చు. అంతేకాదు.. రెండు మూడు నెలల పాటు సదరు అధికారి సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కలెక్టరేట్‌ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. కానీ.. అతనికి నెల నెలా వేతనం మాత్రం ఇచ్చారంటే వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతోంది. ఈ విషయం ఇటీవల కలెక్టరేట్‌లో చర్చకు వచ్చింది. ప్రస్తుత ఏవో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంపై ఆరా తీయగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. వేతనం కలెక్టరేట్‌లో తీసుకుంటూ.. పనులు ఆ ఆధికారి వద్ద ఎలా చేస్తారని ఆరాతీసి.. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని తీసి వేసేందుకు ఏవో ప్రయత్నించగా.. ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పనిచేసే అధికారి.. సదరు రెవెన్యూ అధికారికి లీక్‌ చేశారు. దీంతో.. సదరు అధికారి రంగంలోకి దిగి.. ఆ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి తన వద్దే పనిచేస్తున్నారని, చూసీ చూడనట్లుగా వదిలి వేయమని హుకుం జారీ చేసినట్లు రెవెన్యూ విభాగంలో పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో చేసేదేమీ లేక.. ఉన్నతాధికారులకు ఆ విషయం చెప్పలేక ఆ ఉద్యోగిని యథావిధిగా కొనసాగిస్తున్నారని సమాచారం. అయితే ఆ ఉద్యోగి సదరు రెవెన్యూ అధికారికి బినామీగా వ్యవహరిస్తారని, అందుకే అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేయకుండా అడ్డుపడ్డారన్న చర్చ జరుగుతోంది. సదరు అధికారి ఇటీవలే శంకరపట్నం మండలంలో ఏడెకరాల భూమిని ఓ బినామీ వ్యక్తి పేరుతో కొనుగోలు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండడమేకాదు.. చుట్టుపక్కల పలు భూములు బినామీపేర్లతో ఉన్నాయని తెలుస్తోంది. 

పకడ్బందీగా విచారణ చేస్తేనే బయటకు.. 

ఈ అంశాలన్నింటిపై అత్యంత పకడ్బందీగా విచారణ చేయిస్తే.. జరిగిన తతంగమంతా బయటకు రానుంది. అయితే.. విచారణ అధికారికి రెవెన్యూ అంశాలతోపాటు పదోన్నతుల కల్పన విషయంలో ప్రభుత్వ నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని రెవెన్యూ ఉద్యోగులే పేర్కొంటున్నారు. విచారణ జరిపితే.. జరిగిన అక్రమాలన్నింటినీ పలువురు చెప్పేందుకు సిద్ధంగా ఉండడమే కాదు.. సదరు అధికారి బినామీ ఆస్తుల వివరాలన్నింటినీ పలు ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలాగే.. ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో పనిచేసి లీక్‌లు ఇచ్చే అధికారిని ముందుగా పక్కన పెడితే.. చాలా మంది ఉద్యోగులు విచారణకు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే అవకాశాలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


logo