సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 08, 2020 , 00:16:55

వైద్యంపై నమ్మకం కలిగించాలి

వైద్యంపై నమ్మకం కలిగించాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం కొవిడ్‌-19 వార్డును ఆకస్మికంగా కలెక్టర్‌ శశాంక, వైద్యాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. రోగులకు వైద్యులు, సిబ్బంది మనోధైర్యం కల్పించాలని సూచించారు. కొవిడ్‌-19 పేషెంట్లకు అన్ని సౌకర్యాలు కల్పించామని, పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా మరణాల రేటును తగ్గించేలా అందరూ కృషి చేయాలన్నారు. వైద్యుల కొరత లేకుం డా ప్రత్యేకంగా ఐదుగురిని నియమించామని, ఇప్పటికే 20 మంది స్టాఫ్‌ నర్సులను రిక్రూట్‌ చేశామని, నేడు విధుల్లో చేరుతారని వెల్లడించారు. మరో 16 మంది హెడ్‌ నర్సులను నాలుగైదు రోజుల్లో నియమిస్తామన్నారు. కొవిడ్‌-19 పేషెంట్లకు చికిత్స కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇది 24 గంటలు పని చేస్తుందని, దీనికి ఇన్‌చార్జిగా డాక్టర్‌ అలీం ఆధ్వర్యంలో ఒక పీఆర్‌వో, మంత్రి కార్యాలయం నుంచి, మున్సిపాలిటీ, ప్రభుత్వ దవాఖాన నుంచి పీఆర్‌వోల సమన్వయంతో పని చేస్తారని తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. దవాఖానకు వచ్చే పేషెంట్లకు పది నిమిషాల్లో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతమందికి ఆక్సిజన్‌ అవసరం ఉందో ఇతరత్రా వ్యాధుల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని చికిత్స అందించాలన్నారు. దవాఖానలో 125 ఆక్సిజన్‌ పడకలు, 180 సాధారణ పడకలు కొవిడ్‌ రోగుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం నలుగురు వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారని, రోగులు దవాఖానకు వచ్చి డిశ్చార్జి అయ్యేంత వరకు ప్రతి అంశాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని పూర్తిస్థాయిలో పెట్టాలని, 137 మంది సిబ్బందికి 85 మంది హాజరుకావడంపై మంత్రి ఏజిల్‌ గ్రూప్‌ కాంట్రాక్టర్‌ రాజిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసి దవాఖానను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని చెప్పారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ వై సునీల్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, దవాఖానా సూపరింటెండెంట్‌ రత్నమాల, డీటీసీవో డాక్టర్‌ రవీందర్‌, డాక్టర్‌ వసీం, డాక్టర్‌ సాయిని నరేందర్‌, డాక్టర్‌ రవీందర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్లా హరిశంకర్‌ ఉన్నారు.

14లోగా పార్టీ కమిటీలను నియమిస్తాం

జిల్లాలో ఈనెల 14లోగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అన్ని కమిటీలను నియమించుకుంటామని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి బసవరాజు సారయ్యతో కమిటీపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంతో పాటుగా పార్టీని కూడా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమైన నాయకులతో చర్చించి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళ, యువత, మైనార్టీ అన్ని విభాగాల కమిటీలను నియమిస్తామన్నారు. అతి త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.  


logo