సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 07, 2020 , 03:52:32

మానేరుకు పర్యాటక శోభ తెస్తాం

మానేరుకు పర్యాటక శోభ తెస్తాం

  • lనదిపై 5 చెక్‌ డ్యాంలు నిర్మిస్తాం lఇరుకుల్ల వాగుపైనా మూడింటిని కట్టిస్తాం
  • lరెటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు  lమంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌: కరీంనగర్‌కు మానేరు రివర్‌ ఫ్రంట్‌ ద్వారా పర్యాటక శోభ తెస్తామని, ఇందులో భాగంగా మానేరు నదిపై 5 చెక్‌డ్యాంలను నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఎల్‌ఎండీ డ్యాం కింద మానేరు నదిపై రూ.87.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న 5 చెక్‌ డ్యాంలకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చెక్‌డ్యాంలతో పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీటి సమస్యలు పూర్తిగా తీరుతాయన్నారు. నిరంతరం మానేరు నదిలో పది కిలోమీటర్ల మేరకు నీరు నిల్వ ఉంటుందన్నారు. ఇరుకుల్ల వాగుపై కూడా మరో మూడు చెక్‌డ్యాంలను నిర్మిస్తామన్నారు. కేబుల్‌ బ్రిడ్జి చుట్టూ పర్యాటకులను ఆకర్షించేలా పనులు చేపడుతామన్నారు. చేగుర్తి వరకు ఈ ఐదు చెక్‌ డ్యాంలను నిర్మిస్తామన్నారు. ఇవి పూర్తయిన తర్వాత రెటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఈ డ్యాంల నిర్మాణంతో మానేరు రివర్‌ ఫ్రంట్‌కు తొలి అడుగు పడిందని, రానున్న రోజుల్లో మరింత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. రాముడు దేశ ప్రజలందరికీ దేవుడేనని, రాజకీయాల కంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమకు ముఖ్యమని తెలిపారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ చర్చించామని తెలిపారు. ఎంతో మంది కరోనా పాజిటివ్‌ వచ్చినా త్వరగానే కోలుకుంటున్నారని గుర్తుచేశారు. కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగరెడ్డి మృతి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, ఎంపీపీ లక్ష్మయ్య, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, నాయకులు పెండ్యాల శ్యాం, ముత్యం, శంకర్‌గౌడ్‌, రమణారెడ్డి, బండారి వేణు, ఆకుల ప్రకాశ్‌, జయశ్రీ, తోట రాములు, ఐలేందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. logo