శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 05, 2020 , 01:58:18

భూకబ్జాదారులపై కఠిన చర్యలు

భూకబ్జాదారులపై కఠిన చర్యలు

  • n అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదలం 
  • n కష్టపడి కొన్న వ్యక్తులకు అన్యాయం జరగనివ్వం 
  • n  కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భూకబ్జాదారులపై మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌కు ఒక బ్రాండ్‌ ఇమేజీ ఉం దని, ఒకవైపు స్మార్టు సిటీ రావడం.. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఉమ్మడి జిల్లాలో సాగు పెరగడం, విద్య, వైద్యానికి జిల్లాకేంద్రం హబ్‌గా మారడం, శాంతి భద్రతలు అదుపులో ఉండడం, మంచి రాజకీయ వాతావరణం ఉండడం వల్ల.. చాలామంది కరీంనగర్‌ జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారనని తెలిపారు. నగరానికి మంచి భవిష్యత్‌ ఉందన్న నమ్మకంతో కొనుగోలుదారులు తాము కష్టపడి సంపాదించి, దాచుకున్న డబ్బులతో భూములు కొనుక్కుంటున్నారని చెప్పారు. సదరు వ్యక్తులు వివిధ పనుల నిమి త్తం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. ఇదే అదును గా భూకబ్జాదారులు, ఆక్రమితదారులు వాటిని ఆక్రమించి, లేనిపోని డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. కమిషనరేట్‌ పరిధిలో రోజుకు 20 నుంచి 25 ఫిర్యాదులొస్తే, అందులో 5 నుంచి 7కేసులు భూవివాదాలకు సంబంధించి వస్తున్నాయన్నారు. భూవివాదలు సృష్టించడం, మోఖాపై గొడవలు చేయడం, అన్ని హక్కులు అవతలి వ్యక్తులకున్నా ఒప్పం దం చేసుకోవాలంటూ ఒత్తిడి తవడం.. ఒకే భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేయడం.. ఎప్పుడో అమ్మిన భూములకు మళ్లీ రికార్డులు సృష్టించడం, హద్దులను ఆక్రమించడం, మ్యుటేషన్‌ చేయని విషయాన్ని గుర్తించి.. అక్కడ పాగా వేయడం, ప్రొఫెషనల్‌గా కొంత మంది గ్యాంగులను నడుపుతూ.. భూవివాదాలను తెరపైకి తెచ్చి హక్కుదారులపై ఒత్తిళ్లు తేవడం వంటి అనేక ఫిర్యాదులొస్తున్నాయని చెప్పా రు. ఇప్పటికే వ్యవస్థీకృత (ఆర్గనైజ్‌డ్‌) ముఠా సభ్యులు నడుపుతున్న వివాదాలకు సంబంధించిన అన్ని అంశాలను, సం బంధిత వ్యక్తుల వివరాల జాబితాను తయారు చేశామని తెలిపారు. ఇంకా ఆయన మాటల్లోనే..

కలెక్టతో కలిసి అడ్డుకట్ట వేస్తున్నాం.. 

భూవివాదాలు, ఆక్రమణలు, ఇతర అంశాలపై కలెక్టర్‌తో కలిసి పనిచేస్తున్నాం. వివాదాలు తలెత్తినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కలెక్టర్‌ సమక్షంలో రెవె న్యూ, అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం. వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్‌ పూర్తిగా సహకరిస్తున్నారు. ఆ మేరకే అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి కేసులు నమోదు చేస్తు న్నాం. ఇప్పటికే నలుగురిపై పీడీ యాక్టు  నమోదు చేశాం. 600కుపైగా హిస్టరీ షీట్లను తెరిచాం. పోలీస్‌ పరిధిలో ఉన్న వ్యవహారాలకు సంబంధించి నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పరిపాలనా యంత్రాంగానికి సం బంధించిన ఏమైనా అంశాలు ఉంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు అంతర్గతంగా విచారణ చేయించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటు పోలీస్‌, అటు పరిపాలనా యంత్రాంగం కలిసి పనిచేస్తున్నాం. అం దరి లక్ష్యం ఒక్కటే. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ఏ ఒక్క వ్యక్తికీ అన్యాయం జరగవద్దు. ఇదే మా లక్ష్యం. 

 మరింత కఠినంగా వ్యవహరిస్తాం..

కష్టపడి ప్రతి పైసా పోగు చేసి కొనుగోలు చేసిన భూములను ఆక్రమించినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా ఏ పనిచేసినా.. సంబంధిత వ్యక్తులపై మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తాం. ఇందుకోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం స్థానిక పోలీసు అధికారులతో కలిపి పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి బృందాలను పెంచుతాం. ఇప్పటికే భూకబ్జాదారులు తమ వ్యవహార శైలి మార్చుకోవాలి. లేకపోతే సంబంధిత వ్యక్తుల వ్యవహరించే తీరును బట్టి.. రౌడీషీటర్‌ లేదా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం. కొంత మంది తెలివిగా వెనకుండి ఆక్రమణల పర్వం నడిపిస్తున్నా రు. వారి బాగోతం కూడా బయటకు తీసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. బొమ్మకల్‌ విషయంలో ఎవరిపై తమకు వ్యక్తి గత కక్ష లేదు. బాధితులకు న్యాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. భూకబ్జారాయుళ్లు, భూ వివాదాలు సృష్టించి దౌర్జన్యానికి పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అక్రమాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం. ఇటీవల నమోదవుతున్న కేసులు అం దుకు నిదర్శనం. బొమ్మకల్‌ వ్యవహారం ముగిసినట్లు కాదు. ఫిర్యాదులొస్తే విచారణ కొనసాగుతంది. ఇది ఒక రోజుతో ఒడిచిపోయేది కాదు. నిరంతర ప్రక్రియ. 

 అన్నీ చూసుకోవాలి..

భూమి కొనే ముందు తొందరపడద్దు. ఒకటికి రెండు సార్లు చెక్‌చేసుకోవాలి. ఆ తర్వాతే కొనుగోలు చేయాలి. ఏ మాత్రం తొందరపడినా అసలుకే మోసం వస్తుంది. తక్కువ ధరకు వస్తుందని నమ్మిమోసపోవద్దు. అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలి. లేదంటే ఆన్‌లైన్‌ రికార్డులు పరిశీలించుకోవాలి. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. సంతృప్తి చెందిన తర్వాతే కొనాలి. కొన్న తర్వాత రెవెన్యూ పరంగా మ్యుటేషన్‌ చేయించుకోవాలి. కొంత మంది మాటలు నమ్మి.. తొందర పడి ఇన్వెస్ట్‌మెంట్‌ పెడితే ఇబ్బందిపడాల్సి వస్తుంది. మోసం చేసిన వ్యక్తుల పై కేసులు పెట్టవచ్చు గానీ, చెల్లించిన డబ్బులు రికవరీ చేయ డం అంత సులువు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇసుక దందాపై నిరంతర నిఘా..

ఇసుక అక్రమ దందాపై నిరంతరం నిఘా కొనసాగుతుంది. ప్రభుత్వ పాలసీ కింద సరఫరా అవుతున్న ట్రాక్టర్లను చూసి కూడా కొంత మంది ఇసుక మాఫియా నడుస్తున్నదని, పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరికాదు. గడిచిన ఒక్క నెలలతోనే అక్రమంగా తరలిస్తున్న 280 ట్రాక్టర్లను సీజ్‌ చేశాం. అలాగే డ్రోన్లతో ఇసుక డంపులను గుర్తించి వాటిని మైనింగ్‌ శాఖకు అప్పగించాం. అయితే వ్యక్తిగత రెసిడెన్షియల్‌ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం. ముఖ్యంగా కమర్షియల్‌గా వినియోగించే ట్రాక్టర్లపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటు న్నాం. అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయంలో కరీంనగర్‌ పోలీసులు తీసుకున్న చర్యలను డీజీ ప్రశంసించారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మన విధానాలనే అమలు చేయాలని ఇతర అధికారులకు కూడా సూచించారు. విలేకరుల సమావేశంలో కమిషనర్‌తోపాటు అడిషనల్‌ సీపీలు హెచ్‌ శ్రీనివాసు, జీచంద్రమోహన్‌ పాల్గొన్నారు. logo