బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 05, 2020 , 01:58:30

పార్కు స్థలాలను అభివృద్ధి చేస్తాం

పార్కు స్థలాలను అభివృద్ధి చేస్తాం

  •  నగర మేయర్‌ వై. సునీల్‌రావు  n వార్డుల్లో పార్కు స్థలాల పరిశీలన

కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలోని పార్కు స్థలాలన్నింటినీ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 23వ డివిజన్‌ వివేకానందనగర్‌లోని పార్కు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కాలనీలోని పార్కు స్థలాలను చదును చేసి, కబ్జాకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని పార్కుల అభివృద్ధి కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కింగ్‌, గ్రీనరీని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మర్రి భావన, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

బాధితులను ఆదుకుంటాం

నగరంలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు భరోసా కల్పించారు. 25, 3 డివిజన్లలో వానలకు కూలిన గోడలను ఆయన పరిశీలించి రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోకి మరోసారి వర్షపు నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ యార్డు వైపు ఉన్న డ్రైనేజీ వాల్‌ ఎత్తును పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కూలిపోయిన ప్రహరీ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, ఎడ్ల సరిత తదితరులు పాల్గొన్నారు. 


logo