శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 04, 2020 , 02:32:58

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • n  త్వరలోనే నాన్‌ ఆయకట్టు  గ్రామాలకు సాగునీరు
  • n  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 

జగిత్యాల రూరల్‌/మేడిపల్లి/ కథలాపూర్‌/ మల్యాల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఉద్ఘాటించారు. సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్‌ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమయ్య, రైతు బంధు సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాంమోహన్‌, మల్యాల సర్పంచ్‌ సుదర్శన్‌, ఇంజినీరింగ్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, రిటైర్డ్‌ ఎస్‌ఈ గోవిందరావు కలిశారు. ఈ సందర్భంగా వరద కాలువకు ఎగువ ఉన్న గ్రామాలకు లిఫ్టుల ద్వారా సాగునీరు అందించేందుకు మ్యాప్‌ ద్వారా వివరించారు. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరదకాలువకు ఎగువ గల మేడిపల్లి, కథలాపూర్‌, మల్యాల మండలాల్లోని గ్రామాలకు త్వరలోనే లిఫ్టుల ద్వారా సాగు నీరు అందించే దిశగా పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్‌ ద్వారా మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లోని 46వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడిపల్లి మండలంలోని కాచారం నుంచి ఒడ్యాడు వరకు రంగాపూర్‌ నుంచి గోవిందారం వరకు లిఫ్టుల ద్వారా వ్యవసాయ సాగునీరు అందించే పనులు త్వరలోనే చేపడుతామని వివరించారు. అలాగే కథలాపూర్‌ మండలంలోని దుంపేట, పెగ్గెర్ల గ్రామాల వద్ద లిప్టులు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని చెరువులు నింపుతామని స్పస్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులున్నారు.


logo