ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 04, 2020 , 02:33:08

నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి

నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండండి

  • కరోనాకు ఎవరూ అతీతులు కారు lజాగ్రత్తలు పాటిస్తేనే వైరస్‌ నుంచి కాపాడుకోవచ్చు
  • lబాధితులను మానవతా దృష్టితో చూడాలి  lసిరిసిల్ల పర్యటనలో పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్‌  

సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్‌: పండుగపూట రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల పర్యటన సమీక్ష, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఉత్సాహంగా సాగింది. సోమవారం ఉదయం 9.30కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మంత్రి 11.40గంటలకు జిల్లా ప్రాంతీయ దవాఖానలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డును ప్రారంభించారు. దవాఖానలో జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్య బృందంతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కరోనా నివారణ చర్యలను వివరించారు. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. తన పుట్టిన రోజున జిల్లాకు అందించిన ఐదు అంబులెన్స్‌లను దవాఖాన ఆవరణలో జెండా ఊపి జడ్పీ అధ్యక్షురాలు అరుణతో కలిసి ప్రారంభించారు. దవాఖానలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు. అనంతరం 1.10 గంటలకు సిరిసిల్ల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిలోని పంచాయతీ రాజ్‌ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈల కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 1.40 గంటలకు సర్దాపూర్‌లోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన 30 పడకల ఐసొలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం 2.35గంటలకు నూలుపౌర్ణమిని పురస్కరించుకొని పాత బస్టాండ్‌ ప్రాంతంలోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. 3 గంటలకు సిరిసిల్లలో మాతృవియోగం కలిగిన మాజీ కౌన్సిలర్‌ సందీప్‌ కుటుంబాన్ని ఓదార్చారు. 

కరోనా టెస్ట్‌లు చేసేలా సామర్థ్యం పెంపు..

జిల్లాలో 16 ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు నిర్వహించేలా స్థాయిని పెంచనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జిల్లాలో రోజుకు వెయ్యి టెస్టులు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 పీహెచ్‌సీలలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో 50 పరీక్షల చొప్పున, జిల్లా దవాఖానలో 200 -250 వరకు టెస్టులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. సర్దాపూర్‌ వ్యవసాయ కళాశాలలో 32 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని మొదటి విడుతగా ప్రారంభించామని తెలిపారు. అవసరాన్ని బట్టి ఆరు వేల మందికి సరపడా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యం త్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. పరిస్థితి తీవ్రతను బట్టి అదనంగా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. కరోనా బాధితులందరికీ హోం ఐసొలేషన్‌ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. జిల్లా దవాఖానలో ప్రత్యేకంగా 50 పడకల కరోనా వార్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 10 పడకలు ఐసీయూతో ఏర్పాటు చేశామని, పూర్తి సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. సోమవారం ప్రారంభించిన ఐదు అంబులెన్స్‌లలో ఒకటి పూర్తి స్థాయిలో వెంటిలేటర్‌ సౌకర్యంతో ఉందన్నారు. అంబులెన్స్‌ల ద్వారా సేవలందించేందుకు సిబ్బందిని నియమించినట్లు వివరించారు.

జిల్లా దవాఖానకు 2.28 కోట్ల నిధులు..

వ్యవసాయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనాను అరికట్టేందుకు జిల్లా దవాఖానకు సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి 2.28 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు. సొంతంగా తాను 20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించి, జడ్పీ అధ్యక్షురాలికి చెక్కు అందజేశారు. ఈ నిధులను శానిటేషన్‌, అవుట్‌సోర్సింగ్‌ వేతనాలు, కరోనా నివారణకు మాత్రమే ఖర్చు చేయాలని, రానున్న రోజుల్లో దవాఖానలో మౌలిక సదుపాయాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నిర్ణయాధికారం దవాఖాన కమిటీకి అప్పగించినట్లు ప్రకటించారు. అనంతరం కొవిడ్‌ అటెండర్స్‌కు హోం ఐసొలేషన్‌ కిట్లు అందజేశారు. 

మానవతా కోణంలో స్పందించాలి..

కరోనా బాధితులపై ప్రజలు మానవతా కోణంలో స్పందించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కరోనాకు ఎవరూ అతీతులు కారని, నిర్లక్ష్యం వద్దని, వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా సోకిన వృద్ధ దంపతులు నగరంలో ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. కరోనా ఆత్మహత్య చేసుకునేంత భయంకరమైన వ్యాధి కాదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కరోనా సోకిన ప్రముఖులు కోలుకున్నారని ఉదహరించారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులకు ప్రజలు గౌరవమివ్వాలని కోరారు.  

ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే  పర్యటనలు..

ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి రక్షించుకోవచ్చని, తమను తాము నియంత్రించుకొని వైరస్‌ను నివారించాలని కోరారు. తాను మార్చి నెల నుంచి రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నానని గుర్తు చేశారు. ప్రజల అవసరాలను తీర్చేందుకే తమ పర్యటనలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు,  జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ,  అదనపు కలెక్టర్‌ అంజయ్య, శిక్షణ కలెక్టర్‌ రిజ్వాన్‌ షేక్‌ బాషా, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు మంచ శ్రీనివాస్‌, అధికారులు తదితరులు 

పాల్గొన్నారు.

శానిటేషన్‌ సిబ్బందికి వేతనాలు పెంపు

జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో పని చేస్తున్న శానిటేషన్‌ సిబ్బందికి వేతనాలు పెంచినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శానిటేషన్‌ సిబ్బంది కోరిక మేరకు వారి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మరణాలు రేటు తక్కువగా ఉందని, ఇంకా జాగ్రత్తగా ఉంటే మరణాల రేటును తగ్గించి ఆరోగ్య తెలంగాణగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్‌తో సమస్య పరిష్కారం కాదు

లాక్‌డౌన్‌తో ప్రజలకు పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాదని మంత్రి  పేర్కొన్నారు. వారిని అసౌకర్యాలకు గురిచేయడం తప్ప లాక్‌డౌన్‌తో ప్రయోజనం లేదన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, రక్షణ చర్యలు పాటిస్తే కరోనా నుంచి కాపాడుకోవచ్చన్నారు. సుమారు 9 నెలల పాటు కరోనాతో సహజీవనం తప్పదన్నారు.logo