శనివారం 08 ఆగస్టు 2020
Karimnagar - Aug 02, 2020 , 02:32:14

‘హరిత’ ఠాణా

‘హరిత’ ఠాణా

హుజూరాబాద్‌: ఆ ఠాణా ఆవరణలో ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం కన్పిస్తుంది. నడివేసవిలో కూడా చల్లదనంతో హాయిగా ఉంటుంది. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు పోలీసు సిబ్బంది కలిసికట్టుగా చేస్తున్న కృషితో నేడు హుజూరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పచ్చదనంతో కళకళలాడుతూ ప్రత్యేకతను సంతరించుకున్నది.

స్వచ్ఛమైన ప్రాణవాయువును పంచే ఉద్దేశంతో సీఐ మాధవి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిత్యం విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా ఆమె స్టేషన్‌ ఆవరణలో తిరుగుతూ మొక్కలను పరిశీలిస్తారు. హరితహారంలో భాగంగా గతేడాది మియావాకి పద్ధతిలో స్టేషన్‌ ఆవరణలో దాదాపుగా 500 మొక్కలు నాటగా, 99శాతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

 పది గుంటల్లో పండ్లు, పూల మొక్కలు

స్టేషన్‌ ఆవరణలో మామిడి, జామ, సీతాఫలం లాంటి పండ్ల మొక్కలు నాటారు. రెండు నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను వేస్తుండడంతో అవి కాయలు కాసే దశలో ఉన్నాయి. గులాబీ, మందార, లిల్లీ తదితర రకరకాల మొక్కలు పూలు పూస్తూ ముచ్చట గొల్పుతున్నాయి. ఇవే కాకుండా వేప, ఉసిరి, అడవితంగేడు ఏపుగా పెరుగుతున్నాయి. పది గుంటల స్థలంలో మియావాకి పద్ధతిలో నాటిన మొక్కలతో ఠాణా ఆవరణ చిట్టడవిని తలపిస్తున్నది.

సంరక్షణకు సరికొత్త విధానం

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా టౌన్‌ సీఐ మాధవి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెండు దఫాలుగా స్టేషన్‌ ఆవరణలో మొక్కలు  పెట్టారు. నాటిన వారి పేర్లను అట్టపై రాసి మొక్కలకు తగిలిస్తారు. దీనివల్ల వాటి సంరక్షణ బాధ్యత సక్రమంగా ఉండడంతో ఒక శాతం కూడా ఎండిపోకుండా ఎదిగాయి. వారానికోసారి  సీఐతో సహా మొత్తం సిబ్బంది ఓ అరగంట శ్రమదానం చేస్తూ కలుపు తొలగిస్తుంటారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడం.. రాణా ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతుండడంపై సీపీ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌రావు సీఐని అభినందించారు.


logo