గురువారం 13 ఆగస్టు 2020
Karimnagar - Aug 01, 2020 , 01:45:12

సాగు సంబురం

సాగు సంబురం

  • సకాలంలో సర్కారు పెట్టుబడి సాయం 
  • ఉత్సాహంగా కదిలిన రైతాంగం  
  • సీఎం పిలుపుతో నియంత్రిత సేద్యం 
  • ఉమ్మడి జిల్లాలో పనులు ముమ్మరం 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. వానకాలానికి ముందే సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలను నింపడంతో ఇప్పుడు మత్తళ్లు దుంకుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బావు లు, బోర్లలో ఊట పెరిగింది. ఇటు కాళేశ్వర జలాలతో వరదకాలువనూ నింపడంతో కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్‌గా మారింది. తూములతో అందుబాటులో ఉన్న చెరువులకు నీళ్లివ్వడంతో ఆయకట్టు లేని ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు ఉబికి వచ్చాయి. దీంతో సేద్యపు బావుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. జూలై వ రకు తూముల ద్వారా చెరువులను నింపారు. ఫలితంగా ఆకాశానికేసి చూడకండా నార్లు పోసుకున్న రైతులు గతంకంటే ముందే వరినాట్లు వేస్తున్నారు.

నిరంతరం కరెంట్‌..

నాటి పాలనలో కరెంట్‌ ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. రాత్రిళ్లు మోటర్ల వద్దే గడపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా కరెంట్‌ సమస్యకు పరిష్కారం చూపింది. వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఫలితంగా రైతాంగానికి రంది లేకుండా పోయింది. రైతులు ఎప్పుడంటే అప్పుడు పొలానికి నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 3,50,185 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, 1,26,439ల కనెక్షన్లతో జగిత్యాల రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ విద్యుత్‌ను వాడుకుంటున్న జిల్లాగా ఇప్పటికే  రికార్డు సృష్టించింది. పెరిగిన భూగర్భజలాలతో బావులపై సేద్యం ఈసారి మరింత గొప్పగా జరిగే అవకాశాలున్నాయి. 

రైతుబంధు భరోసా

నాడు సీజన్‌ వచ్చిందంటే పెట్టుబడుల కోసం తండ్లాడేది. అప్పల కోసం సేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ఇంట్ల ఏమైనా బంగారు గొలుసులుంటే కు దవ పెట్టేది. తిరిగి పంట చేతికి వచ్చినంక అమ్మి కట్టే ది. స్వరాష్ట్రంలో ఈ తిప్పలన్నీ తప్పాయి. సీజన్‌కు ముందే సర్కారు రైతుబంధు కింద పెట్టుబడికి సాయం చేస్తున్నది. ఒక్కో సీజన్‌లో ఎకరాకు 5 వేల చొప్పున అందజేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో 6,01,345 మంది రైతులు రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందారు. వీరికి ఈ సీజన్‌లో ఇప్పటికే రూ.616.62 కోట్ల సాయం అందింది. ఇక ప్రతి రైతుకు రైతు బీమాను ప్ర భుత్వం చెల్లించింది. ఎకరానికి ఒక ఫసల్‌కు రూ.ఐదు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు సాగు పనుల్లో మునిగిపోయారు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు..

ఉమ్మడి జిల్లాలో సేద్యానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వరి, పత్తి, కంది, సోయా, పసుపు పం టలను ప్రధానంగా సాగు చేసే అవకాశం ఉండడంతో వాటికి సంబంధించిన విత్తనాలను, ఎరువులను ముందుగానే సిద్ధం చేసింది. 75,898 మె ట్రిక్‌ టన్నుల ఎరువులను, 2,21,360 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది.  

బిజీగా రైతులు..

ప్రభుత్వం ప్రాథమిక అవసరాలను తీర్చడంతో రైతులు సంతోషంగా సాగుకు సిద్ధమయ్యారు. జలవనరులు, విద్యుత్‌ను ఇస్తుండడం, విత్తనాలు, ఎరువులను చేరువ చేయడం, పెట్టుబడి కూడా ఇస్తుండడంతో ఆనందోత్సాహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11,91,833 ఎకరాల సాగు విస్తీర్ణం అంచనా కాగా, ఇందులో 7,53,228 ఎకరాల్లో వరి, 3,50,151 ఎకరాల్లో పత్తి వేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, వర్షాలు సకాలంలో కురవడంతో సేద్యపు పనుల్లో రైతులు బిజీగా మారారు.

నీటి కష్టాలు మర్చిపోయినం

మా బూరుగుపల్లి ఊరు రైతులమంతా వరద కాలువ, మా చెరువు మీద ఆధారపడే పంటలు వేస్తం. కాళేశ్వరం నీళ్లు రాకముందు వరదకాలువల సుక్క నీరు ఉండకపోయేది. చెరువు నెర్రెలు బారేది. నాకు 1.35 ఎకరాల ఎవుసం భూమి ఉంది. నీళ్లు లేక మొత్తం బీడు వెట్టెటోన్ని. ఏదన్న కొంచెం పొలం ఏసినా నీళ్లందక ఎండిపోయేది. మా అసోంటి రైతుల కష్టాలు తీర్చడానికి కేసీఆర్‌ దేవుని లెక్కనే వచ్చిండు. పెట్టుబడికి అప్పులు చేయకుంట రైతుబంధు కింద పైసలిస్తండు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీళ్లిచ్చి చెరువు నింపిండు.. ఇప్పుడు నీటి కష్టాలు మర్చిపోయినం. మా కోసం ఇన్నిజేస్తున్న ముఖ్యమంత్రి సారుకు రుణపడి ఉంటం.

- దూలం శంకర్‌గౌడ్‌, రైతు, బూరుగుపల్లి(గంగాధర)


logo