ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:35:46

15లోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

15లోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

  • n  కలెక్టర్‌ శశాంక
  • n చిగురుమామిడి మండలంలో   నిర్మాణ పనులు పరిశీలన

చిగురుమామిడి : మండలంలో రైతు వేదికల నిర్మాణం, హరితహారం లక్ష్యం ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. మండలంలోని ముదిమాణిక్యం, చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనాలను గురువారం ఆయన పరిశీలించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారంలోగా రైతు వేదిక భవనాలు రూఫ్‌ లెవల్‌ వరకు నిర్మించాలని డీఈని ఆదేశించారు. గ్రామాల్లో చేపడుతున్న కల్లాల నిర్మాణ పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుర్తిలో రైతు వేదిక నిర్మాణానికి స్థలం సేకరించి, పనులు ప్రారంభించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావును ఆదేశించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో త్వరగా మొక్కలు నాటాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని సూచించారు.  కాగా, ముదిమాణిక్యం గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ జక్కుల రవి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ కూలీలకు కూలి డబ్బులు త్వరగా చెల్లించాలని ఎంపీటీసీ ఏలేటి రవీందర్‌ విజ్ఞప్తి చేశారు. 

పంటల వివరాల నమోదు తప్పనిసరి

వానకాలంలో రైతులు వేసే పంటల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్‌ శశాంక వ్యవసాయాధికారులను ఆదేశించారు. ముదిమాణిక్యం గ్రామంలో వ్యవసాయాధికారులు చేస్తున్న పంటల సర్వే వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. పొలాల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వే చేసి, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. వానకాలంలో వేసే పంటల వివరాలు, జాబితాను నమోదు చేస్తూ, రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఏవో రంజిత్‌కుమార్‌, ఏఈవో సౌజన్య సర్వే చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసీ గీకురు రవీందర్‌, పీఆర్‌ డీఈ సుదర్శన్‌, మండల ప్రత్యేకాధికారి, బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి బాల సురేందర్‌, తహసీల్దార్‌ ముబిన్‌ అహ్మద్‌, ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్‌, వైస్‌ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ఏఈ రవిప్రసాద్‌, సర్పంచులు జక్కుల రవి, బెజ్జంకి లక్ష్మణ్‌, శ్రీమూర్తి రమేశ్‌, ఎంపీటీసీ ఏలేటి రవీందర్‌రెడ్డి, మెడబోయిన తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఇన్‌చార్జి ఏపీవో రాజయ్య, ఎంఈవో విజయలక్ష్మి, తదితరులున్నారు. 


logo